ధోని స్థానాన్ని ఆ యువ ఆట‌గాడే భ‌ర్తీ చేస్తాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2020 1:41 PM GMT
ధోని స్థానాన్ని ఆ యువ ఆట‌గాడే భ‌ర్తీ చేస్తాడు

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరును సువ‌ర్ణాక్ష‌రాల‌తో లికించుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని. భార‌త్ కు రెండు ప్ర‌పంచ క‌ప్‌లు (2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌) లు అందించాడు. అంతేకాకుండా ధోని కెప్టెన్సీలోనే ఛాంపియ‌న్స్ ట్రోఫిని ముద్దాడింది. దీంతో మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ధోని మంచి ఫినిష‌ర్ మాత్ర‌మే కాకుండా అత్యుత్త‌మ వికెట్ కీప‌ర్ కూడా. త‌న బ్యాటింగ్‌తో జ‌ట్టుకు ఎన్నో మ‌రుపురాని విజ‌యాల‌ను అందించాడు. 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత మ‌ళ్లీ టీమిండియా జెర్సీలో ధోని క‌నిపించ‌లేదు.

ధోని రిటైర్‌మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత‌ని స‌న్నిహితులు కూడా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత మ‌హేంద్రుడు రిటైర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ధోని రిటైర్‌మెంట్ అయితే ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసే ఆట‌గాడు ఎవ‌రు..? అంత‌టి స‌త్తా ఎవ‌రిలో ఉంది..? ధోని స్థానాన్ని భ‌ర్తీ చేసే ఆట‌గాడిపై చాలా అంచనాలే ఉంటాయి. ధోనికి వార‌సుడిగా నిన్న‌టి వ‌ర‌కు రిష‌బ్ పంత్ పేరు వినిపించింది. అయితే అంచనాల‌ను అందుకోవ‌డంలో అత‌డు విఫ‌ల‌మైయ్యాడు.

ప్ర‌స్తుతం వికెట్ కీప‌ర్ కంటే మంచి ఫినిష‌ర్ భార‌త జ‌ట్టుకు అవ‌స‌రం. ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసే సామ‌ర్థ్యం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ యువ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ కు ఉంద‌ని అంటున్నాడు భార‌త సీనియర్ ఆట‌గాడు రాబిన్ ఉత‌ప్ప‌. దీనిపై ఓ ఇంట‌ర్య్వూలో ఉత‌ప్ప మాట్లాడాడు. టీమ్ఇండియాలో ధోని త‌రువాత ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కు ప‌రాగే స‌మాధాన‌మ‌ని ఉతప్ప తేల్చిచెప్పాడు. భార‌త జ‌ట్టులో ప‌రాగ్‌ను చూసేందుకు తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని పేర్కొన్నాడు. భార‌త జ‌ట్టుకు సుధీర్ఘ కాలం ప్రాతినిథ్యం వ‌హించేస‌త్తా అత‌నిలో ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

2019 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన 18 ఏళ్ల రియాన్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఆ సీజ‌న్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన ప‌రాగ్ 160 ప‌రుగులు చేయ‌డంతో పాటు రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. టోర్నీ చ‌రిత్ర‌లో అత్యంత పిన్న వ‌య‌సులో హాఫ్ సెంచ‌రీ సాధించిన ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కాడు.

ఓ క్రికెట‌ర్‌గా రియాన్ ప‌రాగ్‌కు మంచి అవ‌గాహాన ఉంద‌ని ఆస్ట్రేలియా ఆట‌గాడు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. నెట్స్‌లో అత‌డి బ్యాటింగ్ చూస్తుంటే ఎంతో అనుభ‌వం ఉన్న ఆట‌గాడిలా క‌నిపించాడ‌ని, అత‌డికి ఎంతో మంచి భ‌విష్య‌త్ ఉందని చెప్పాడు.

Next Story