తెలంగాణ రాష్ట్రానికి కరోనా వైరస్‌ భయం పట్టుకుంది. గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తెలిసినప్పటి నుంచి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంసీహెచ్‌ఆర్డీలో రాష్ట్ర కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని, 24 గంటలు నడిచే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా వస్తే చనిపోతారు అన్న ప్రచారం వాస్తవం కదన్నారు. కరోనాపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షలో.. కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తొమ్మిది డిపార్ట్‌మెంట్‌ల సమన్వయంతో పని చేస్తామన్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు చెప్పారు. ఊపిరితిత్తుల వ్యాధినిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటామని ఈటల రాజేందర్‌ తెలిపారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేట్‌ ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేశామని తెలిపారు. కరోనా అనుమానం ఉన్న రోగులను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలని చెప్పామని, ప్రజలకు విశ్వాసం కలిగించడం మన బాధ్యత అని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. గాంధీ ఆస్పత్రిలో నిర్లక్ష్యం కొరవడింది. ఆస్పత్రిలో మాస్క్‌ల కొరత వెంటాడుతోంది. ఎన్‌ 95 మాస్క్‌లు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో పెషెంట్లు వస్తున్న.. మాస్క్‌ల కొరత నెలకొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిపై పెషెంట్లు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.