'కోవిడ్‌ సైరన్'‌.. తెలంగాణ హై అలర్ట్‌

By అంజి  Published on  3 March 2020 3:43 AM GMT
కోవిడ్‌ సైరన్‌.. తెలంగాణ హై అలర్ట్‌

ముఖ్యాంశాలు

  • తెలంగాణలో 380కి చేరినా కరోనా అనుమానితులు
  • అప్రమత్తమైన ప్రభుత్వం, ప్రజలకు సూచనలు జారీ
  • కొవిడ్‌-19 వ్యాప్తితో తెలంగాణలో హై అలర్ట్‌
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సహా గాంధీ, ఫీవర్‌, ఉస్మానియా ఆస్పత్రుల్లో అప్రమత్తత
  • కొవిడ్‌ చికిత్సకు చెస్ట్‌ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్న తెలంగాణ సర్కార్‌
  • అవసరమై మందులు అందుబాటులో ఉంచాలంటూ అధికారులకు ఆదేశం

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 (కరోనా వైరస్) తెలంగాణకు పాకింది. కాగా, భారత్‌లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఢిల్లీలో మరో వ్యక్తికి కూడా ఈ వైరస్‌ ఉన్నట్లు పేర్కొంది. కాగా, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి ఇటలీ దేశం నుంచి వచ్చినట్లు తెలిపింది. కరోనా సోకిన ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

హైదరాబాద్‌ చెందిన కరోనా పాజిటివ్‌ యువకుడు గడిచిన 14 రోజుల్లో ఎవరెవర్ని కలిశాడు అనేది ప్రస్తుతం కీలక అంశంగా మారింది. ఇప్పుడు ఈ విషయమై తెలంగాణ ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం యువకుడికి గాంధీ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌.. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన అంశాలపైనే చర్చించారు. కరోనా సోకిన యువకుడు బెంగళూరులో 2 రోజులు ఉద్యోగానికి వెళ్లారు. అతడు ఎవరితో కలిసి ఉన్నాడు, వీరిలో తెలంగాణకు చెందిన వారు ఉన్నారా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు. కరోనా సోకిన యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సుల్లో వచ్చాడు. అయితే ఏసీ వల్ల వాతావరణం చల్లగా మారుతుంది. ఈ క్రమంలో వైరస్‌ వ్యాపి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బస్సులో మొత్తం 27 మంది ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది.

తెలంగాణలో కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి కేసు కొంచెం భిన్నమైంది. ఎందుకంటే అతడికి నేరుగా వైరస్‌ సోకలేదు. హాంకాంగ్‌ చెందిన వ్యక్తి ద్వారా ఇతడి వైరస్‌ సోకినట్లుగా వైద్యులు అనుమానిస్తున్నారు. సెకండ్‌ కాంటాక్ట్‌ ద్వారా.. అది థర్డ్‌ కాంటాక్ట్‌ చేరిందని తెలుస్తోంది. ఇలా థర్డ్‌ కాంటాక్ట్‌కు సోకిన తర్వాత వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు.

Next Story