బస్సులో ప్రయాణించిన కరోనా రోగి.. పరుగులు పెడుతున్న అధికారులు
By తోట వంశీ కుమార్ Published on 30 May 2020 11:03 AM ISTకరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్ విధించగా.. కొన్నింటికి సడలింపులు ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో బస్సులను నడపడానికి కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఓ ఘటన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో.. అతడితో పాటు ఆ బస్సులో ఎంత మంది ప్రయాణించారు అనే వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమైయ్యారు.
ఈ నెల 23న ఓ వ్యక్తి విజయవాడ నుంచి శ్రీకాకుళానికి వెళ్లాడు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం డిపోల్లో అతడు బస్సులు మారాడు. శ్రీకాకుళం వెళ్లిన తరువాత అతడికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా తేలింది. శ్రీకాకుళం పోలీసులు అడిగిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం బస్టాండ్ నుంచి విశాఖకు అతడితో పాటు అదే బస్సులో ఎంత మంది ప్రయాణించారనే వివరాలను ఆర్టీసీ అధికారులు సేకరించారు. మొత్తం 14 మంది విశాఖకు వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఆ 14 మందిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో 2874 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మరి భారీన పడి 60 మంది మృత్యువాత పడ్డారు.