భారత ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ ప్రభావం.. భారీగా ఉత్పత్తి నష్టం

By అంజి  Published on  26 March 2020 4:28 AM GMT
భారత ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ ప్రభావం.. భారీగా ఉత్పత్తి నష్టం

ఢిల్లీ: కరోనా వైరస్‌ భారత ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేసింది. మూడు వారాల పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల భారత్‌ తొమ్మిది లక్షల కోట్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భారత జీడీపీలో నాలుగు శాతానికి సమానమని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్త బార్‌క్లేస్‌ అంచనా వేసింది. 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ వల్ల 90 బిలియన్‌ డాలర్ల నష్టంతో పాటు, అంతకు ముందు రాష్ట్రాలు అమలు చేసిన లాక్‌డౌన్‌ దీనికి మరింత అదనమని పేర్కొంది. బుధవారం నాడు ఈక్విటీ మార్కెట్లను లాక్‌డౌన్‌ ఏ మాత్రం ప్రభావితం చేయలేదు.

Also Read: జియోపై కన్నేసిన ఫేసుబుక్‌.. నిజమేనా.!

అయితే ఆర్థిక ఉద్దీపనతో పాటు వృద్ధి అంచనాల్లో కోత విధించడమే దీనికి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. 2020-21 బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. అయితే అది ఇప్పుడు 5 శాతానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: తెలంగాణలో 41, ఏపీలో 10 కరోనా కేసులు

ఏప్రిల్‌ 3న ఆర్బీఐ ప్రకటించనున్న తొలి ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను 0.65 శాతం తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ పెను ప్రతికూల ప్రభావం చూపుతుందని కేరే రేట్సింగ్స్‌ ఓ నివేదికలో అంచనా వేసింది. ఈ 21 రోజుల్లో 80 శాతం ఉత్పత్తికి నష్టం జరుగుతుందని వివరించింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై రోజు వారి రూ.40 వేల కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. మొత్తంగా రూ.6.3 లక్షల కోట్ల నుంచి రూ.7.2 లక్షల వరకు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. అయితే లాక్‌డౌన్‌ను 21 రోజులకే ఆపేస్తారా లేక మరి కొన్ని రోజులు పెంచుతారా.. అన్న విషయంపై గణంకాలు ఆధారపడి ఉన్నాయి.

Next Story