తెలంగాణలో 41, ఏపీలో 10 కరోనా కేసులు

By అంజి  Published on  26 March 2020 2:34 AM GMT
తెలంగాణలో 41, ఏపీలో 10 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 41కి చేరింది. బుధవారం నాడు ఓ మహిళకు, మూడేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.

గోల్కోండ ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం సహా బాలుడు ఇటీవల సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చారు. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత జలుబు, దగ్గు రావడంతో వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకిన విషయం బయటపడింది. బాలుడి తల్లిదండ్రులను కూడా వైద్యులు ఆస్పత్రిలోనే ఉంచారు. వీరికి ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

కోకాపేటకు చెందిన మహిళకు ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా కరోనా సోకింది. మొదట అతని భర్తకు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈమెతో మొత్తం ఆరుగురికి రెండవ దశలో కరోనా సోకింది.

Also Read: పారాసిటమాల్‌తో ఎత్తుగడ.. చివరకు

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, ప్రజలు ఎవరూ కూడా బయట తిరగవద్దని ఆరోగ్యశాఖ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం 40 మంది కరోనా బాధితులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 10 కి చేరింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. వాషింగ్టన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. గుంటూరు జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది.

Next Story