షిరిడీపై కరోనా ఎఫెక్ట్
By రాణి Published on 17 March 2020 7:57 AM GMTకరోనా వైరస్ ప్రభావం దేశంలోని ఆలయాలపై కూడా పడింది. కరోనా ప్రభావంతో ఇప్పటికే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కాణిపాకంలో అయితే అడపా దడపా భక్తులు వస్తున్నారు గానీ..ఇదివరకున్నంత భక్తుల రద్దీ అయితే కనిపించడం లేదు. ఒక్క తిరుపతి, కాణిపాకం ఏంటి..తెలుగురాష్ర్టాల్లో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల పరిస్థితి ఇదే. ఇప్పటికే కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్ సెంటర్లు ఇలా..చాలా వరకూ మూతపడ్డాయి. తాజాగా అత్యధిక రద్దీ ఉండే ప్రముఖ షిరిడీ దేవాలయాన్ని కూడా మూసివేయాలని నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలొచ్చేంతవరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ముందస్తు ప్రకటన చేశారు.
Also Read : కరోనా పై ఆర్ఆర్ఆర్ హీరోలు చెప్పిన ఆరుసూత్రాలివే (వీడియోతో)
ప్రస్తుతం దర్శనం కోసం వచ్చిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. రేపటి నుంచి షిరిడీకి రావాలనుకునేవారు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాల్సిందిగా సూచించారు. దేశంలో ఇప్పటి వరకూ 125 కరోనా కేసులు నమోదవ్వగా..మహారాష్ర్టలో దీని తీవ్రత మరింత అధికంగా ఉంది. 39 కేసులు నమోదు అవ్వగా..మంగళవారం 64 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి మరణించడంతో..అక్కడి ప్రభుత్వం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. ఇలా కరోనా ఎఫెక్ట్ తో ఆలయాలు మూత పడటం వల్ల..ఆయా సంస్థలకు వచ్చే ఆదాయానికి కూడా గండి పడనుంది. ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ తక్కువ అవ్వడంతో..ఆర్టీసీ ఆదాయానికి భారీ మొత్తంలో ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది.
Also Read : 24 గంటలు.. 14,000 కేసులు.. 7,100 మరణాలు