కరోనా మహమ్మారి వ్యాప్తికి సూత్రధారి అయిన చైనా ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటుండగా..అక్కడి డాక్టర్లు మాస్క్ లను తీసివేసి ఆనందంతో గెంతులేసిన పనిచేశారు. కానీ చైనా వెలుపల చాలా దేశాలు కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడంతో.. కేవలం ముందస్తు జాగ్రత్త చర్యలతోనే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా పలు సూచనలు చేశారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం కూడా ఈ దిశగా అడుగులేసింది. ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కరోనాను కట్టడి చేసేందుకు ఆరు సూత్రాలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

Also Read : కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం 15 సూచనలు

వీడియోలో ముందుగా రామ్ చరణ్ మాట్లాడుతూ..WHO సూచించిన ఆరు సూత్రాలను పాటిస్తే కోవిడ్ 19 నుంచి మనం బయటపడగలమని తెలిపారు.
1.చేతులను మోచేతి వరకూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లో కూడా. బయటికి వెళ్లివచ్చినప్పుడు..ఇలా కనీసం రోజుకు 7-8 సార్లు.
2.తెలిసిన వారెవరైనా ఎదురైతే..షేక్ హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం మానేయాలి. అనవసరంగా కళ్లు తుడుచుకోవడం, ముక్కు రుద్దుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి.
3.మీకు పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్ లు వేసుకోవాలి. ఇవేమీ లేకుండా మాస్క్ లు వేసుకుంటే కోవిడ్ 19 మీకు అంటుకునే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా తుమ్మినపుడు, దగ్గినపుడు అర చేతులను కాకుండా మోచేతులను అడ్డం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి.

Also Read : కరోనాతో మరో వ్యక్తి మృతి

4.జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకండి. మంచినీళ్లు ఎక్కువగా తాగండి. గడగడ ఒకేసారి ఎక్కువ తాగేకన్నా..కొద్దికొద్దిగా ఎక్కువసార్లు మంచినీళ్లు తాగండి. వేడినీళ్లు తాగడం ఇంకా మంచిది.
5.వాట్సాప్ లో వచ్చే ప్రతీ వార్తని దయచేసి గుడ్డిగా నమ్మేయకండి. వాటిలో నిజమెంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ఆందోళనకరమైన పరిస్థితులను కల్పించకండి. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం.
6.WHO (World Health Organisation) వెబ్ సైట్ లో వైరస్ నియంత్రణకు సూచనలిస్తుంటారు. వాటిని ఫాలో అవుదాం. కోవిడ్ 19 మీద ప్రభుత్వమిచ్చే సలహాలను, సూచనలను పాటిద్దాం. మనల్ని మనమే కాపాడుకుందాం.

పరిశుభ్రంగా ఉందాం..సురక్షితంగా ఉందాం..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.