యావత్ భూ మండలాన్నీ కలవరపెడుతున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేసింది. కరోనా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకూ దేశంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు..హాస్టళ్లు, ఇతర విద్యాసంస్థలను కూడా మూసివేయాల్సిందిగా అన్ని రాష్ర్ట ప్రభుత్వాలకు సూచనలిచ్చింది. అలాగే థియేటర్లు, జిమ్ సెంటర్లు, మ్యూజియంలు, సాంస్కృతి, సామాజిక కార్యక్రమాలు జరిగే వేదికలు, ఫంక్షన్ హాల్స్, స్విమ్మింగ్ పూల్స్ కూడా మూసివేయాల్సిందిగా కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. సెలవులిచ్చారు కదా అని..విద్యార్థులు మూకుమ్మడిగా ప్రయాణాలు చేయరాదని వారించింది. అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని తెలిపింది. పరీక్షల సమయంలో ఇంకా తరగతులు నిర్వహించాల్సి వస్తే..ఆన్ లైన్ ద్వారా పాఠాలు చెప్పాల్సిందిగా కేంద్రం సలహా ఇచ్చింది. ఒకరికొకరు దూరంగా ఉండటం ద్వారానే కరోనాను జయించగలమని పేర్కొంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచించిన 15 నిబంధనలు కాకుండా..రాష్ర్ట ప్రభుత్వాలు ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చునని కూడా తెలిపింది.

Also Read : 116కు చేరిన భారత్ కరోనా బాధితుల సంఖ్య

కేంద్రం చెప్పిన 15 షరతులిలా..

1. అన్ని విద్యాసంస్థలు మూసివేత

2.ప్రత్యక్ష సమావేశాలు రద్దు. అత్యవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించుకోవచ్చు.

3.అన్ని రెస్టారెంట్లలో వినియోగదారులు చేతులను శుభ్రం చేసుకునే ప్రొటోకాల్ అమలు చేయాలి. టేబుళ్లు, కుర్చీలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తుండాలి. టేబుల్ కి టేబుల్ కి మధ్య మీటర్ దూరం ఉండాలి. అవసరమైతే ఆరుబయట కూడా సీట్లు ఏర్పాటు చేయాలి.

4.తప్పనిసరిగా ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. శారీరకంగా దూరం పాటించడంతో పాటు షేక్ హ్యాండ్, కౌగిలింతలు వంటి వాటికి దూరంగా ఉండాలి.

5.ఆన్ లైన్ ద్వారా వస్తువులను ఇళ్లకు చేర్చే వారికోసం తగిన రక్షణ కల్పించాలి.

6.సమాజానికి నిరంతరంగా సమాచారాన్నిస్తుండాలి.

7.వీలైనంత వరకూ పరీక్షల్ని వాయిదా వేసేందుకు ప్రయత్నించాలి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య కనీసం మీటర్ దూరాన్ని పాటించగలిగితేనే ఇప్పుడు జరుగుతున్న పరీక్షలను కొనసాగించాలి.

8.మతపరమైన కార్యకలాపాలు, సభలు, సమావేశాల్లో ప్రజలు పెద్దఎత్తున గుమిగూడకుండా స్థానిక అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలి. మతపెద్దలతో మాట్లాడి నచ్చజెప్పాలి. అలా కుదరదనుకుంటే ఒక్కొక్కరికి మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read : విమానయానంలో కరోనా కేర్

9.ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పని వేళలను మార్చాలి. ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయలు, పండ్లు మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసుల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలి.

10.వీలైనప్పుడల్లా ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించేలా ఆయా కంపెనీలు చర్యలు తీసుకోవాలి.

11.ఇప్పటికే నిశ్చయమైన పెళ్లిళ్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలుండేలా చూసుకోవాలి. ఎక్కడా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి. లేదా పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం ఉత్తమం.

12.క్రీడా రంగాల్లో జరిగే కార్యక్రమాలు, పోటీలను వేసుకోవడం శ్రేయస్కరం. సంబంధిత నిర్వాహకులకు స్థానిక అధికారులు ఈ విషయంపై నచ్చజెప్పాలి.

13.వ్యాపార సంస్థలు తమ వద్దకు వచ్చే వినియోగదారుల మధ్య మీటరు దూరం పాటించాలి. రద్దీ సమయాల్లో ఎక్కువమంది గుమిగూడకుండా చూసుకోవాలి.

14.కరోనా వైరస్ విషయంలో ఆస్పత్రులు కూడా ప్రొటోకాల్ అనుసరించాలి. అక్కడున్న రోగులను చూసేందుకు వచ్చే కుటుంబీకులు, పిల్లల్ని ఆస్పత్రుల్లోకి అనుమతించరాదు.

15.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. అన్ని వాహనాలను తగిన విధంగా శుభ్రం చేస్తుండాలి.

రాణి యార్లగడ్డ

Next Story