కరోనా ప్రభావం రాఫెల్ యుద్ధ విమానాలపై కూడా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 April 2020 9:30 AM GMT
కరోనా ప్రభావం రాఫెల్ యుద్ధ విమానాలపై కూడా..!

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కూడా కరోనా వైరస్ కారణంగా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దాదాపు మూడు నెలల ఆలస్యంగా రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలు భారత్ ఎయిర్ ఫోర్స్ చెంతకు చేరనున్నాయి. ఫ్రాన్స్ దేశం ఇప్పటికే కోవిద్-19 దెబ్బకు అతలాకుతలం అయింది.. దీంతో పలు విషయాల్లో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.. ఇది రాఫెల్ విమానాల ట్రైనింగ్ షెడ్యూల్ పై కూడా ప్రభావం చూపింది. దీంతో దాదాపు మూడు నెలల ఆలస్యంగా రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు రానున్నాయని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.

మార్చి నెల మధ్యలో 8-9 నెలల పాటూ ఒక బ్యాచ్ కు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత మొదటి బ్యాచ్ విమానాలను భారత్ కు తీసుకుని రావాలని అనుకున్నారు. అలాగే లాజిస్టిక్ సపోర్ట్ ఎక్విప్మెంట్, టెస్ట్ ఎక్విప్మెంట్ ను ఏప్రిల్ మొదటి వారంలో అంబాలాకు తీసుకుని రావాల్సి ఉండగా.. భారత్ విధించిన లాక్ డౌన్ కారణంగా విమానాల రాకపోకల విషయంలో కూడా ఆంక్షలు విధించారు.

కరోనా మహమ్మారిని ఫ్రాన్స్ అదుపు చేయడానికి ఫ్రాన్స్ కు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఆంక్షలను సడలించి యూరప్ నుండి భారత్ కు విమానాలను తీసుకుని రావాలంటే వచ్చే జులై వరకూ ఆగాల్సిందే..! అక్టోబర్ లో రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ కు వెళ్ళినప్పుడు.. మే నెల లోపు మొదటి బ్యాచ్ విమానాలు భారత ఎయిర్ ఫోర్స్ చెంతకు చేరుతాయని చెప్పారు. నాలుగు ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటూ 8-10 Meteor మిసైల్స్ కూడా ఇవ్వనున్నారని ఆనాడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

మే 2020 డెడ్ లైన్:

నవంబర్ నెలలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ డిఫెన్స్ శ్రీపాద్ నాయక్ పార్లమెంట్ కు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ మూడు రాఫెల్ యుద్ధ విమానాలు మే నెలాఖరుకల్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చేరుతాయని అన్నారు. 24 మంది పైలట్లు, ఇంజినీర్లు, టెక్నీషియన్లు ఫ్రాన్స్ లో ప్రాక్టీసు కూడా పొందనున్నారని తెలిపారు. వీరందరికంటే ముందు ముగ్గురు ఐఏఎఫ్ పైలట్లు, ఇద్దరు టెక్నికల్ ఆఫీసర్లకు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ రాఫెల్ విమానాల విషయంలో అవగాహన కల్పించాల్సి ఉన్నట్లు కాంట్రాక్టులో ఉంది.

శనివారం నాటికి ఇటలీ 90000 పాజిటివ్ కేసులను చూసింది. 13800కి పైగా మరణాలు సంభవించాయి. మర్చి 17 నుండి అక్కడ లాక్ డౌన్ అమలులో ఉంది. ఫ్రెంచ్ సాయుధ దళాలపై కూడా కరోనా ప్రభావం కనిపించింది. 50 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వాళ్లకు కూడా కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్కింగ్ షిఫ్ట్ లను తగ్గించేశారు.. చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో రాఫెల్ డీల్ కు సంబంధించిన పనులు కూడా ఆలస్యం అవుతున్నాయి.

తొలి రఫేల్‌ విమానాన్ని ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్‌ సంస్థ నుంచి అక్టోబర్‌ 8న అందుకున్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. అనంతరం ఆయుధ పూజా కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలి బ్యాచ్‌ రఫేల్‌ విమానాలు మే 2020లోగా భారత్‌కు చేరనున్నాయని భావించారు. మొత్తం 36 విమానాలను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేసింది.

Next Story