అక్క‌డి పులుల సంరక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 April 2020 7:20 AM GMT
అక్క‌డి పులుల సంరక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు..!

కరోనా వైరస్ పులికి సోకిందని తెలియగానే భారత్ కూడా వన్య ప్రాణి సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం తమ పరిధి లోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటున్న పులుల కోసం తగినన్ని జాగ్రత్తలు చేపట్టింది. తిపేశ్వర్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం యవత్మాల్ జిల్లా లోని ఫంధర్కావ్డ తాలూకాకు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ సంరక్షణ కేంద్రంలో ఒక ఆడపులి మూడు కూనలకు నవంబర్ నెలలో జన్మనిచ్చింది. ప్రస్తుతం పులులకు కూడా కరోనా వైరస్ సోకుతోంది అని వార్తలు రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. అక్కడి అధికారులు పులులకు కరోనా వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తిపేశ్వర్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక్కసారిగా కరోనా విజృంభిస్తే అక్కడి జంతువులన్నిటినీ కాపాడుకోవడం కష్టమే..! వాటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం 143చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ప్రాంతంలో వివిధ సైజ్, వయసులకు చెందిన 20కి పైగా పులులు ఉన్నాయి.. కాబట్టి ఇన్ఫెక్షన్ అన్నది విపరీతంగా ప్రబలే అవకాశం ఉంది.

తిపేశ్వర్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలోని 'కవల్ టైగర్ రిజర్వ్' కు అతి దగ్గరలో ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు పులులు అక్కడి నుండి కవల్ టైగర్ రిజర్వ్ కు వస్తూ ఉంటాయి. ఇటీవలే ఓ ఆడపులి పెనగంగ నదిని, రెండు రాష్ట్రాల బోర్డర్స్ ను దాటుకుని వచ్చి మరీ కవల్ లో రెండు నెలల పాటూ ఉండి.. తిరిగి తిపేశ్వర్ కు చేరుకుంది. ఇలాంటప్పుడు వైరస్ ప్రబలితే మొత్తం పులుల మనుగడకే ప్రమాదం పొంచి ఉంది.

పులులకు కరోనా వైరస్ సోకుతోంది అని మీడియాలో రాకముందు నుండే తాము అన్ని జాగ్రత్తలను తీసుకున్నామని, తిపేశ్వర్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం కూడా లాక్ డౌన్ లో ఉందని ఫంధర్కావ్డ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుభాష్ పురానిక్ తెలిపారు. వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంలోకి ఎవరినీ అనుమతించడం లేదని. ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేదుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు పులుల సంఖ్యను కూడా లెక్కిస్తూ ఉన్నామని అన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు తిరుగుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నామని అన్నారు. నీటి కుంటల వద్ద ఉన్న కెమెరాలు కూడా పని చేస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నామన్నారు. ఏవైనా పులులు బలహీనంగా కనిపిస్తే మాత్రం వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెబుతున్నారు అధికారులు.

అమెరికా లోని బ్రాంక్స్ జూ లో ఉన్న పులికి కరోనా వైరస్ సోకిందని తెలియడంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. అమెరికాలో కరోనా వైరస్ సోకిన మొదటి జీవి ఇదే కాగా.. ఒక పులికి కరోనా వైరస్ సోకడం.. ఈ భూమిపై ఇదే ప్రప్రథమం అని ఫెడరల్ అధికారులు స్పష్టం చేశారు. మలయన్ జాతి పులి అయిన నాలుగు సంవత్సరాల నదియా, అలాగే ఆరు పులులు, సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి. జూలో పని చేసే ఉద్యోగి కారణంగా వాటికి కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిలో మాత్రం కరోనా వైరస్ లక్షణాలు లేవు. మార్చి 27 వ తేదీన నదియాలో కోవిద్-19 లక్షణాలు కనిపించాయని.. కానీ క్రమక్రమంగా అది కోలుకుంటోందని జూ అధికారులు తెలిపారు. న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో మార్చి 16న ఆ జూను మూసివేశారు.

Next Story