క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటున్న కరోనా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 9:05 AM GMT
క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటున్న కరోనా

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 6 లక్షల దిశగా దూసుకెళ్తుంది. రోజులు గడిచే కొద్దీ వేలల్లో కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా పుట్టినిల్లైన చైనా లో కూడా ఇన్ని కేసులు, మరణాలు లేవు. కానీ చైనా వెలుపల దేశాలన్నీ కరోనాతో అతలాకుతలమవుతున్నాయి. ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్థమయింది.

ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా వైరస్ వ్యాపిస్తుందో అర్థంకాని పరిస్థితి. కరోనా రాకముందు వరకూ క్యాబ్ డ్రైవర్లకు భవిష్యత్ పై ఆశ కలిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఆ ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. అద్దె కార్లలో ప్రయాణిస్తే ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనన్న భయంతో చాలా వరకు ప్రజలు క్యాబ్ లలో ప్రయాణించడం మానేశారు. వీలైనంత వరకూ సొంత వాహనాలపైనే ప్రయాణిస్తున్నారు.

ఇది వరకూ చాలా వరకూ క్యాబ్ లను ఐటీ కంపెనీలే వాడుకునేవి. ఉద్యోగుల డ్రాపింగ్, పిక్ అప్ చేసుకునేందుకు క్యాబ్ లను అద్దెకు తీసుకునేవి. కానీ ఇప్పుడు 90 శాతం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మిగతా వారు కూడా సొంత వాహనాలపై వెళ్లేందుకే మొగ్గు చూపుతుండటంతో క్యాబ్ డ్రైవర్లకు బుకింగ్ లు లేక ఆదాయం తగ్గిపోయింది. కరోనా ముందు వరకు 12 గంటల్లో 12 -14 బుకింగ్ లు వస్తే ఇప్పుడు కనీసం అందులో సగం కూడా రావడం లేదని వాపోతున్నారు క్యాబ్ డ్రైవర్లు.

అంతేకాక నెలాఖరు వచ్చేసరికి ఇంటి అద్దె, పాలబిల్లు, కేబుల్ బిల్లు, పిల్లల కోసం ఇలా రూ.15000-20000 వరకూ ఖర్చవుతుందంటున్నారు. డ్యూటీకి వెళ్లినా వచ్చే జీతాలు అంతంత మాత్రంగా ఉండటంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రతి నెలా అప్పుతో పాటు వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయని, వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా దిక్కుతోచడం లేదని వాపోతున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు పెట్రోలు, డీజిల్ ధరలను కూడా రోజురోజుకూ పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పొట్టకూటి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తుందంటున్నారు. తమను నమ్ముకుని ఉన్న కుటుంబ సభ్యులను ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని బిక్కమొహమేస్తున్నారు. తమకొచ్చే బుకింగ్ లలో 25 శాతం కమిషన్ ను కంపెనీనే తీసుకుంటుందని, మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుని, అప్పులు కట్టుకుని, డీజిల్ కొనుక్కొని రోజులు నెట్టుకురావాలని చెప్పుకొస్తున్నారు. నిండా అప్పుల్లో కూరుకుపోయిన తమలాంటి క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వమే దయతలచి ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story