చిన్న అనుమానం.. ఆ మృతదేహాన్ని మోయడానికి 'ఆ నలుగురు' కరువు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2020 10:20 AM GMTకరోనా మహమ్మారి మానవ సంబంధాలను మరింత దూరం చేస్తోంది. వైరస్ సోకిందనే అనుమానం వచ్చినా చాలు.. సొంతవాళ్లు, ఇరుగుపొరుగు వాళ్లు సైతం ప్రాణం పోతుందన్నా పట్టించుకోని పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో అలాంటి హృదయ విధారక ఘటనే చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో తలారి సత్తెమ్మ మృతదేహాన్ని మోయడానికి ఆ నలుగురు కరువయ్యారు. చిన్న అనుమానం పాడే మోయడానికి నలుగురిని రాకుండా చేసింది.
కరోనా సోకి మృతి చెందిందన్న అనుమానంతో జేసీబీలో శవాన్ని తరలించి పూడ్చి వేసారు. సంఘటన పలువురిని కలసివేసింది. నాలుగురోజుల క్రితం సత్తెమ్మ కుమారునికి కరోనా సోకడంతో ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాడు. వారి కుటుంబంలో భార్య, కుమారులకు తండ్రికి నెగెటివ్ వచ్చింది.
కానీ.. సత్తెమ్మకు నెగెటివ్ వచ్చినా కూడా కరోనాతో చనిపోయి ఉండవచ్చనే అనుమానంతో ఎవ్వరూ కూడ శవాన్ని ముట్టుకోలేదు. దాని దరిదాపులకు కూడా వెళ్లలేదు. కరోన సోకిన సత్తెమ్మ కుమారుడు పీపీఈ కిట్టు ధరించి తన తల్లి శవాన్ని ఎత్తుకుని జేసీబీలో పడుకోబెట్టాడు. ఈ దృశ్యాలను చూసి పలువురు కంటతడి పెట్టారు. పగ వారికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాలో మరి.