రెండో సారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన సీసీఎంబీ డైరెక్టర్‌

By సుభాష్  Published on  26 Aug 2020 9:57 AM GMT
రెండో సారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన సీసీఎంబీ డైరెక్టర్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరిగిపోతోంది. చాలా మంది వైరస్‌ గురించి లేనిపోని అపోహాలు పెట్టుకొంటూ భయాందోళన చెందుతున్నారు. ఈ భయానికే కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు. వైరస్‌ సోకగానే ఏదో అయిపోతుందన్నట్లు, ఇక బతకమేమో అన్నట్లు భయాందోళనకు గురవుతున్నారు. ఆ భయానికి మనిషి మరింత వ్యాధి బారిన పడిపోతున్నాడు. అయితే కరోనా సోకి కోలుకున్నవారికి మళ్లీ రెండో సారి వైరస్‌ సోకడంపై సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా క్లారిటీ ఇచ్చారు.

ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి మళ్లీ రెండు సారి సోకినట్లయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ కరోనా మళ్లీ వచ్చినా అతి తక్కువ మందికి మాత్రమే వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ కరోనా సోకినా దాని ప్రభావం పెద్దగా ఉండదని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా రెండు సారి సోకడంపై లోతైన పరిశోధనలు జరగాలని, అప్పుడే స్పష్టత వస్తుందన్నారు. ఇందుకు కనీసం రెండేళ్ల సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ వైరస్‌లు రెండోసారి సోకిన సందర్భాలున్నాయన్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు రోగ నిరోధక శక్తి తగ్గకుండా జాగ్రత్త పడాలన్నారు.

ప్రస్తుతం వైరస్‌ ప్రభావం అంతగా లేదు

కోవిడ్‌ వైరస్‌ ప్రారంభంలో ఉన్నంత ప్రమాదకరం లేదని, ఐదారునెలల కిందట వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించేవని, అందరికీ శ్వాస సంబంధ సమస్యలు తలెత్తేవని, ఇప్పుడు 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న చాలా మందికి వైరస్‌ సోకిన విషయం, దాని నుంచి కోలుకున్న విషయం కూడా తెలియదన్నారు. వైరస్‌ బలహీనపడుతున్నదని చెప్పడానికి ఇదో సంకేతమని రాకేశ్‌ మిశ్రా అన్నారు.

కోలుకున్నా.. మళ్లీ వైరస్‌

హాంకాంగ్‌లో ఓ వ్యక్తికి రెండోసారి వైరస్‌ సోకింది. ఆ దేశానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్‌లో కరోనా నుంచి కోలుకున్నారు. అనంతరం యూరప్‌లో పర్యటించిన ఆయన ఇటీవల తిరిగి హాకాంగ్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పలు దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి రెండోసారి వైరస్‌ సోకినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో స్పష్టత లేదు. హాంకాంగ్‌లో రెండోసారి వైస్‌ సోకడంపై పూర్తి వివరాలు నమోదు చేసిన తొలి కేసు ఇదేనని పరిశోధకులు భావిస్తున్నారు.

Next Story