కరోనాతో సహజీవనం సరే.. వాస్తవం దారుణంగా ఉందిగా.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 July 2020 6:57 AM GMT
కరోనాతో సహజీవనం సరే.. వాస్తవం దారుణంగా ఉందిగా.!

ఏపీకి ఏమైంది? ఇప్పుడీ ప్రశ్న తెలుగు లోగిళ్లలో ప్రతిధ్వనిస్తోంది. రోజువారీగా విడుదల అవుతున్న కరోనా బులిటెన్ లోని అంకెల్ని చూస్తుంటే మతి పోతోంది. రాకెట్ స్పీడ్ తో పెరిగిపోతున్న కేసుల సంఖ్యకు మూలం ఏమిటి? ఎక్కడ తప్పు దొర్లింది? ఎక్కడ తేడా కొట్టింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో చాలా బాగా చేస్తున్నారట అన్న మాటలు ఇప్పుడు వెల్లువలా వెల్లడవుతున్న పాజిటివ్ కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నిన్నటికి నిన్న ఓ మేజిక్ ఫిగర్ ను విడుదల చేసింది జగన్ ప్రభుత్వం. అలా అని వారేదో తప్పుడు లెక్కలు ఇస్తున్నారన్నది ఉద్దేశం కాదు. మరో రెండు కేసులు కలిపితే 8 వేల పాజిటివ్ కేసులు.. అది కూడా ఇరవైనాలుగు గంటల్లో. హైదరాబాద్ లాంటి మహానగరం లేని ఏపీలో.. అసలేం జరుగుతోందన్నది ఎంతకూ అర్థం కావట్లేదు. కేవలం రెండంటే రెండు రోజుల్లో పదహారు వేల కేసులు నమోదు కావటం.. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా మారటం కనిపిస్తోంది.

ఇదెవరి తప్పు? అన్నది ప్రశ్నగా మారింది. కరోనాను నిలువరించే విషయంలో తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని చెప్పుకునే ఏపీ సర్కారు.. కేసుల తీవ్రత అంతకంతకూ ఎందుకు పెరుగుతుందన్న విషయానికి అసలు కారణాన్ని చెప్పలేకపోతున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి పెద్ద ఎత్తున వచ్చేశారని.. ఈ కారణంతోనే కేసులు పెరుగుతున్నాయన్నదే నిజం అనుకుందాం. మరి.. ఇదే తీరులో లాక్ డౌన్ వేళలో కూడా వచ్చారు. అప్పుడు నమోదు కానీ కేసులు ఇప్పుడే ఎందుకు నమోదవుతున్నట్లు? అన్నది మరో ప్రశ్న.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణకు రానివ్వటం మొదట్నించి చూస్తున్నదే. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం అన్ని చెక్ పోస్టుల దగ్గర పెద్ద ఎత్తున సిబ్బంది పెట్టి.. ఆంక్షలు విధించినట్లుగా హడావుడి చేసినప్పటికి రాష్ట్రంలోకి పది లక్షలకు పైనే ఎలా వచ్చేశారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేటోళ్లు కనిపించట్లేదు.

కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఏపీకి వచ్చినోళ్లు ఇరవై లక్షలుగా చెబుతున్నారు. ఇందులో వాస్తవం సంగతి ఎలా ఉన్నా.. ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది. ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు వీలుగా ఈ తరహా వాదనను వినిపిస్తున్నారా? అన్న సందేహం వ్యక్తం కాక మానదు.

కరోనా అంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు.. బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తే సరిపోతుందన్న ఉవాచ ఇప్పటి పరిస్థితికి కారణమా? అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడున్న ఊపు కానీ కొనసాగితే.. రానున్న కొద్దీ రోజుల్లో రోజుకు పదివేల కేసులు నమోదు కావటం ఖాయం. అదే జరిగితే.. నెలలో లక్ష కేసుల్ని టచ్ చేసే వీలుంది. రోగాన్ని గుర్తించినప్పుడు అందుకు సరైన మందు వేస్తే సరిపోతుంది. పెద్ద ఎత్తున పరీక్షలతో పాజిటివ్ లెక్కలు తేలుస్తున్న ఏపీ సర్కారు.. అంతకంతకూ వ్యాపించేందుకు కారణాలు ఏమిటి? అన్నది గుర్తించి వాటికి ఎందుకు చెక్ చెప్పటం లేదు? అన్నది మరో ప్రశ్న.

కరోనాతో సహజీవనం తప్పదని కొందరు.. కలిసి జీవించాలన్న మాట ఓకే. కానీ.. వాస్తవంలో మాత్రం అదెంత భయంకరంగా ఉంటుందన్నది ఏపీలోని ఏ లోగిలిని అడిగినా ఇట్టే చెప్పేస్తుంది. మరీ.. దుస్థితి నుంచి ఏపీ ఎలా బయటపడుతుందో చూడాలి.

Next Story
Share it