రాష్ట్రాల్లో కరోనా అలర్ట్
By అంజి
కరోనా వైరస్ భయంతో ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. కేరళలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ పరమైన వేడుకలు రద్దు చేశారు. సినిమా, డ్రామా కంపెనీలు కూడా తెరవద్దంటూ ఆజ్ఞలు జారీ చేశారు. అలాగే పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలకు సూచించింది. అటు కర్ణాటక లో కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను నలుగురిని గుర్తించారు. వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఉంచి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌కు చెందిన ఓ మహిళకూ కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఆ మహిళ ఇటీవల ఇరాన్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న ఈశాన్య రాష్ట్రాలు కూడా విదేశీయుల రాకపోకలపై నియంత్రణ విధించాయి. ముఖ్యంగా విదేశీ సరిహద్దుల వద్ద ఆంక్షలు విధిస్తున్నాయి. సిక్కిం ప్రభుత్వం ఇప్పటికే చైనా, భూటాన్ సరిహద్దు వద్ద నియంత్రణలను అమలుచేస్తోంది. తాజాగా మయన్మార్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తూ మణిపూర్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ద్వారా విదేశీయుల రాకపోకలపై పూర్తి నిషేధం విధించింది. ఇండో-మయన్మార్ దేశసరిహద్దులో ఉన్న అన్ని గేట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అంతేకాకుండా మరో ఈశాన్యరాష్ట్రమైన మిజోరం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. మయన్మార్‌తో పాటు బంగ్లాదేశ్‌కు రాకపోకలను పూర్తిగా నిషేధించామని వెల్లడించింది. మరో రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ కూడా విదేశీయులకు ఇచ్చే ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్‌ల జారీని నిలిపివేసింది. చైనా సరిహద్దు కలిగిన అరుణాచల్‌ప్రదేశ్‌లోకి విదేశీయులు రావాలంటే పీఏపీ తప్పనిసరి. అయితే కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పీఏపీలను జారీచేయకుడదని ఆరాష్ట్ర ముఖ్యకార్యదర్శి నరేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు.
అసోం రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. భూటాన్ నుంచి వచ్చిన అమెరికన్ వ్యక్తికి కరోనా నిర్ధారణ కాగా అతనితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 400మందిని ప్రత్యేక పరిశీలనలో ఉంచినట్లు ఆరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా దాదాపు 10 రాష్ట్రాల్లో ఇప్పటికే సుమారు 50 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.