'మా'లో మళ్లీ విభేదాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 12:29 PM GMT
మాలో మళ్లీ విభేదాలు..!

హైదరాబాద్‌: 'మా'లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. జీవిత రాజశేఖర్, నరేష్‌ల మధ్య దూరం పెరిగినట్లుగా తెలుస్తోంది. 'మా' అధ్యక్షుడు నరేష్‌పై ఈసీ మెంబర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనరల్‌ మీటింగ్‌కు హాజరుకావాలని ఈసీ సభ్యులకు జీవిత రాజశేఖర్‌ సందేశాలు పంపడంతో మాలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నరేష్‌ను కాదని ఏర్పాటు చేసిన 'మా' సమావేశం గందరగోళంగా జరగడంతో కొందరు సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు 'మా' అసోసియేషన్‌లో నెలకొన్న వివాదంపై ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు ప్రెసిడెంట్‌ ఆఫ్ ఇండియాలా ఫీలవుతున్నారని పృథ్వీ ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ మెంబర్‌గా గెలిచినందుకు ఆనందపడాలో.. బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. 'మా'లో జరుగుతున్న కొన్ని పరిణామాలు నన్ను బాధించాయని పృథ్వీ అన్నారు. సమావేశంలో కొందరి తీరు నచ్చక తాను బయటకు వచ్చానని రచయిత పరుచూని గోపాలకృష్ణ తెలిపారు. మా సమావేశంపై అధ్యక్షుడు నరేష్‌ తీవ్రంగా స్పందించారు. అధ్యక్షుడిని కాదని మీటింగ్‌ ఎలా పెడతారని అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో నరేష్‌ మినహా మిగిలిన సభ్యులందరూ సమావేశానికి హాజరయ్యారు. ఇది కేవలం ఫ్రెండ్లీ సమావేశమని జీవిత రాజశేఖర్‌ తెలిపారు.

Next Story
Share it