టీ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్.. పార్టీకి ఊపొస్తుందా?
By సుభాష్ Published on 12 Sep 2020 5:55 AM GMTతెలంగాణ అధికారపక్షానికి సరైన రీతిలో చెక్ పెట్టే సమర్థత.. సామర్థ్యం ఉన్నట్లుగా కాంగ్రెస్ నేతలు తమ గురించి తాము చాలా గొప్పగా చెబుతుంటారు. వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ ఇచ్చింది తామేనని.. తమను తెలంగాణ ప్రజలు ఆదరించటమే కాదు.. నెత్తిన పెట్టుకుంటారన్న అంచనాలు చూస్తేనే.. వారి మీద వారికి ఎంతటి నమ్మకమో ఇట్టే అర్థమవుతుంది. పేరు ప్రఖ్యాతులకు ఏ మాత్రం కొదవ లేని నేతలు పలువురు పార్టీలో ఉన్నా.. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిందే.
ఒకప్పుడు తెలంగాణలో ఏ మూల చూసినా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. కనుచూపు మేర ఆ పార్టీని టచ్ చేసే అవకాశమే ఉండదన్నట్లుగా ఉండేది. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ఎలా అవుతాయన్నది తెలంగాణలో కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీల ప్రయాణాన్ని చూస్తేనే ఇట్టే అర్థమవుతుంది. గడిచిన రెండు దఫాలుగా అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. తెలంగాణలో పుంజుకోవటానికి ఇప్పటికైతే అవకాశం లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది.
తెలంగాణ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అధిష్ఠానం.. తాజాగా కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు పావులు కదుపుతోంది. ఆర్నెల్ల పాటు సోనియా సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నడవాలన్న నిర్ణయం ఇటీవల తీసుకోవటం తెలిసిందే. దీనికి ముందు సీనియర్లు పలువురు కలిసి లేఖ రాయటంతో చోటు చేసుకున్న కలకలం అంతా ఇంతా కాదు. రాహుల్ గాంధీనికి టార్గెట్ చేసేలా ఉన్న ఈ లేఖపై సోనియా సైతం తీవ్ర ఆగ్రహాంతో ఉన్నట్లు చెబుతున్నారు.
పార్టీని ప్రక్షాళన చేసేందుకు వీలుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సోనియాగాంధీ. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా ఉన్న కుంతియా స్థానంలో మాణిక్యం ఠాగూర్ ను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కుంతియాను పక్కన పెట్టి.. యువకుడైన మాణిక్యంకు పార్టీ బాధ్యత అప్పగించటం చూస్తే.. కాంగ్రెస్ లో యువ రక్తాన్ని నింపాలన్న యోచనలో అధినాయకత్వం ఉన్నట్లుగా చెప్పాలి.
సీనియర్లు.. వయసు మళ్లిన వారిని పక్కన పెట్టేసి.. యువ నాయకత్వాన్ని ఎంపిక చేస్తున్న క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా మాణిక్యం పేరును ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన ఈ కాంగ్రెస్ నేత.. పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్ యూఐలో విద్యార్థి నాయకుడిగా తన పొలిటికల్ కెరీర్ షురూ చేశారు.
తర్వాతి కాలంలో ఆల్ ఇండియా ఎన్ఎస్ యూఐకి జనరల్ సెక్రటరీగా.. ఉపాధ్యక్షుడిగా బాధ్యతల్ని నిర్వర్తించిన ట్రాక్ రికార్డు ఉంది. 2009లోనూ 2019లోనూ రెండు దఫాలు తమిళనాడు విరుధానగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తీసిపారేయలేని ట్రాక్ రికార్డు ఉన్న మాణిక్యం ఠాగూర్ ఎంపికపై టీ కాంగ్రెస్ నేతలు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలుNext Story