ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

By సుభాష్  Published on  12 Sep 2020 4:54 AM GMT
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్‌ నాయకుడు స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేశ నలుమూలలా జరిగిన అన్ని రకాల ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన స్వామి అగ్నివేశ్‌.. వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై ప్రత్యేకంగా పోరాటం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి అనేక సభల్లో ప్రసంగించారు.

స్వామి అగ్నివేశ్‌ 1939 సెప్టెంబర్‌ 21న శ్రీకాకుళం జన్మించారు. ఆయన అసలు పేరు వేపా శ్యామ్‌రావ్‌. నాలుగేండ్ల వయసులోని తండ్రిని కోల్పోయారు. న్యాయ, ఆర్థికశాస్త్రాల్లో పట్టాలు సాధించిన కోల్‌కతాలోని సెయింట్‌ వేవియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సవ్యసాచి ముఖర్జీ న్యాయవాదిగా ఉన్న సమయంలో అగ్నివేశ్‌ ఆయన కింద జూనియర్‌గా పని చేశారు.

చిన్న వయసు నుంచే ఉద్యమాల వైపు..

అలాగే చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితుడై అగ్నివేశ్‌.. 1968లో ఆర్యసమాజ్‌లో చేరి సన్యాసం స్వీకరించారు. 1970లో ఆర్యసభను స్థాపించారు. 1977లో హర్యానా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్నమతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పని చేశారు. అలాగే 1979లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. అప్పుడే 1981లో వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బాండెడ్‌ లేబర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని క్వారీల్లో బానిసలుగా ఉన్న ఎంతో మందికి విముక్తి కల్పించారు. అంతేకాకుండా ఆర్యసమాజ్‌ అత్యున్నత మండలి అయిన వరల్డ్‌ కౌన్సిల్‌కు 2004 నుంచి 2014 వరకు అగ్నివేశ్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. ఐరాస ఆధ్వర్యంలోని బానిసత్వ నిర్మూలన ట్రస్ట్‌కు 1994 నుంచి 2004 వరకు చైర్‌పర్సన్‌గా కూడా పని చేశారు.

తెలంగాణ ఉద్యమానికి మద్దతు

స్వామి అగ్నివేశ్‌ తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచి మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బలంగా తన వాణి వినిపించారు. 2003 ఏప్రిల్‌లో వరంగల్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవ సభకు మాజీప్రధాని దేవేగౌడతో కలిసి వచ్చి లక్షల మంది ప్రజల సమక్షంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. అలాగే 2010లో కూడా వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన తెలంగాణ మహాగర్జన సభలో కూడా అగ్నివేశ్‌ పాల్గొన్నారు. అగ్నివేశ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story
Share it