రేవంత్, మల్లు రవి అరెస్ట్.. ఖండించిన ఉత్తమ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Aug 2020 9:13 AM GMT
రేవంత్, మల్లు రవి అరెస్ట్.. ఖండించిన ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం పవర్‌ఫ్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు శ్రీశైలం వెళ్తే బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. తప్పు చేయకపోతే ప్రభుత్వానికి భయమెందుకు? వారి కుట్రలను ప్రజలకు తెలియకుండా చేయాలని చూస్తున్నారు.. మమ్మల్ని అక్రమంగా నిర్బంధించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి దుర్మార్గాలు చేస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలియజేయాలి. శ్రీశైలం ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఖండించిన ఉత్త‌మ్

రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులుగా శ్రీశైలం సంఘటనను పరిశీలించడం, బాధితులను పరామర్శించడం కనీస బాధ్యత అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు.ప్రభుత్వ తప్పిదాలు బయట పడతాయని పోలీసులను ప్రభుత్వం ఉపయోగించి నిర్బంధానికి పాల్పడుతోందన్నారు. రేవంత్, మల్లు రవిలను వెంటనే విడుదల చేసి శ్రీశైలం సంఘటన స్థలాన్ని సందర్శించే అనుమతి ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే.. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.

Next Story