హాట్‌హాట్‌గా సీడబ్ల్యూసీ భేటీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Aug 2020 2:00 PM IST
హాట్‌హాట్‌గా సీడబ్ల్యూసీ భేటీ

కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం వాడివేడిగా కొనసాగుతోంది... పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారు. రాజీనామా చేస్తానని సీడబ్ల్యూసీ సమావేశంలో వ్యాఖ్యానించిన సోనియా.. తన స్థానంలో వేరే వారిని నియమించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. పార్టీలో నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతోన్న ఈ భేటీలో మొత్తం 48మంది నేతలు పాల్గొన్నారు. వీరిలో 20మంది సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు.. మరికొంతమంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే, సోనియాగాంధీ నిర్ణయంతో ఆమె వారసత్వాన్ని ఎవరు అందుకుంటారన్నదానిపై చర్చ సాగుతోంది.

ఇదిలావుంటే.. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ.. 23 మంది సీనియర్లు సోనియాకు లేఖ రాయడంపై సీరియస్ అయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న సందర్భంలో ఆ లేఖను సోనియాకు ఎందుకు పంపించారంటూ నేతలను నిలదీశారు. అంతేకాకుండా ఆ సమయంలో సోనియా గాంధీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని, ఆ సమయంలోనే లేఖ పంపారంటూ ఫైర‌య్యారు. అసమ్మతి సభ్యులు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ విష‌య‌మై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కూడా స్పందించారు. లేఖ రాయడం చాలా దురదృష్టకరం. ఆ లేఖ హైకమాండ్‌ను, పార్టీని కూడా బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక సీనియర్ నేత ఆంటోనీ కూడా లేఖపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

రాహుల్ వ్యాఖ్య‌ల‌పై కపిల్ సిబల్, గులాంనబీ ఆజాద్ ఘాటు సమాధానాలిచ్చారు. మీరు ఆరోపించినట్లు ఒకవేళ నేను బీజేపీ ఏజెంట్‌నే అయితే.. ఇప్పుడే వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతానని ఆజాద్ రాహుల్ గాంధీకి ఘాటుగా బదులిచ్చారు. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ కూడా ట్విట్టర్ వేదికగా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మేం బీజేపీతో కుమ్మక్కయ్యామంటారా? రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను నిలబెట్టింది ఎవరు? మణిపూర్‌లో బీజేపీని దించి కాంగ్రెస్‌ను కాపాడిందెవరు? గత 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అలాంటిది.. మమ్మల్నేబీజేపీతో కుమ్మక్కయ్యారంటారా? అంటూ సిబల్ ట్విట్టర్ వేదికగా కడిగిపారేశారు. తాము లేఖ రాయడానికి సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలే కారణమని స్పష్టం చేశారు.

Next Story