మీర్ఉస్మాన్ అలీఖాన్ జీవితంపై పూర్తైన డాక్యుమెంటరీ

By అంజి  Published on  9 Dec 2019 6:32 PM IST
మీర్ఉస్మాన్ అలీఖాన్ జీవితంపై పూర్తైన డాక్యుమెంటరీ

ముఖ్యాంశాలు

  • ఏడో నిజాంపై డాక్యుమెంటరీ నిర్మించిన ముని మనవడు
  • లండన్ లో నివసించే నిజాం మునిమనవడు అజ్మత్ ఝా
  • తాతగారి ఘనతను ప్రపంచానికి చాటేందుకే ఈ ప్రయత్నం
  • విస్తృత స్థాయిలో సమాచారాన్ని సేకరించిన అజ్మత్ ఝా
  • ఇంటర్వ్యూలతో, నేరేషన్ తో సాగిపోయే డాక్యుమెంటరీ

ప్రపంచవ్యాప్తంగా నిజాం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై రూపొందించిన డాక్యుమెంటరీ పూర్తయ్యింది. ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు దాదాపుగా దశాబ్దకాలం పట్టింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో తలమునకలై ఉంది. నిజాం పరంపర గురించి ఆఖరి నిజాం మునిమనవడైన అజ్మత్ ఝా రూపొందిస్తున్న పూర్తి స్థాయి డాక్యుమెంటరీపై కెనడియన్ ఎడిటర్ ప్యాట్రిక్ మైఖేల్ కి మాత్రం అంతగా సంతృప్తిని కలిగించలేదు.

నిజాం వారసుడు పూర్తి స్థాయిలో బ్రిటిష్ కోణంనుంచే ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని చూపించాలని పట్టుబట్టాడు. కానీ ఎడిటర్ మాత్రం భారతీయ కోణంలో చూపిస్తేనే ఆ డాక్యుమెంటరీ పరిపూర్ణంగా ఉంటుందని భావించాడు. ఇద్దరికీ మధ్య అభిప్రాయాల్లో వైరుధ్యం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ కు ఫైనాన్స్ చెయ్యాల్సింది, బాధ్యత వహించాల్సింది తనే కాబట్టి సహజంగా ప్రాజెక్ట్ కి యజమాని అయిన నిజాం మునిమనవడి మాటే నెగ్గింది.

నిజాం ముని మనవడు అజ్మత్ ఝా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. పురానా హవేలీలో ఈమధ్యే ఆయన నిజాం ట్రస్ట్ కు సంబంధించి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. తాను రూపొందించిన డాక్యుమెంటరీని భారత్ , టర్కీ, ఇంగ్లండ్ దేశాల్లోని పౌరులు విశేషంగా అభిమానిస్తారని, ఆదరిస్తారని తను భావిస్తున్నారు.

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి జన సామాన్యంలో ఉన్న అపోహలు, దుష్ప్రచారాలను తొలగించేందుకు, నిజాలను నిగ్గుతేల్చేందుకు, తన ముత్తాత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ డాక్యుమెంటరీని రూపొందించానని అజ్మత్ ఝా చెబుతున్నారు.

ఎనభై నిమిషాల ఈ డాక్యుమెంటరీలో ప్రపంచానికి తెలియని ఎన్నో కొత్త విషయాలున్నాయనీ, ఈ డాక్యుమెంటరీని చూసిన తర్వాత నిజాంపై, నిజాం పరిపాలనపై అందరికీ పూర్తి స్థాయిలో అభిమానం ఏర్పడుతుందని నిజాం వారసుడు చెబుతున్నారు.

పూర్తి స్థాయి అధికారికంగా తమ కుటుంబానికి తెలిసిన ఎన్నో అంశాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచామనీ, తను జీవించిన కాలంలో ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా పేరుమోసిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చరిత్ర ఈ చిత్రం ద్వారా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అంటున్నారు నిర్మాత.

ఇంకా ఈ డాక్యుమెంటరీకి పేరు పెట్టలేదు. బహుశా ప్యాబులస్ నిజాం అనే పేరు ఖరారు కావొచ్చన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంగ్లిష్, ఉర్దూ సబ్ టైటిల్స్ తో ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. ఇందులో నిజాంపాత్రను ఎవరూ పోషించలేదు. అలాగే వివిధ వ్యక్తులనుంచి తీసుకున్న ఇంటర్వ్యూలతోపాటుగా కథను నేరేట్ చేస్తూ కథనం సాగుతుంది. ఈ ఇంటర్వ్యూలలో కుటుంబ సభ్యులతోపాటుగా నిజాం పరంపరతో అనుబంధం ఉన్న బయటి వ్యక్తులు కూడా ఉన్నారు.

విస్తృత స్థాయిలో సేకర‌ణ‌..

తమ కుటుంబానికి చెందిన వందలాదిమంది బంధువులను సంప్రదించి, వారి ఇంటర్వ్యూలు తీసుకుని, సమాచారాన్ని విస్తృత స్థాయిలో సేకరించి పూర్తి స్థాయిలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవితాన్ని తెరకెక్కించారు ఆయన వారసుడు.

నిజాం తనయురాలు షెహజాదీ పాషా, ప్రిన్స్ షెహమత్ ఝా, హబీబ్ యార్ జంగ్, బషీర్ యార్ జంగ్, ముకర్రమ్ ఝా వారసులతోపాటుగా హైదరాబాద్ లో ఉన్న వెనకటి తరానికి చెందిన, నిజాం కొలువులో నమ్మకంగా పనిచేసిన కుటుంబాలకు చెందినవారిని ఎందరినో సంప్రదించి విలువైన సమాచారాన్ని సేకరించిన తర్వాతే డాక్యుమెంటరీ చిత్రీకరణ ప్రారంభమయ్యింది. ఈ డాక్యుమెంటరీలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను కేవలం పరిపాలకుడిగా మాత్రమే కాక, గొప్ప కవిగా కూడా చిత్రీకరించారు.

మొదటి ఈ డాక్యుమెంటరీని కుటుంబంకోసం నిర్మించ తలపెట్టామనీ, తర్వాత కుటుంబ సభ్యుల సలహాతో అందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని భావించి పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి, అనేక విషయాలను సేకరించి, పూర్తి జనరంజకంగా ఈ డాక్యుమెంటరీని మలిచామని నిజాం వారసుడు అజ్మత్ ఝా చెబుతున్నారు.

నిజాం వారసుడిగా ఘనత వహించిన కుటుంబానికి వారసుడిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న అజ్మత్ ఝా అత్యంత సాధారణంగా కనిపించడం విశేషం. సాధారణ జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులతో అతి సామాన్యమైన జీవనాన్ని గడపడానికి ఇష్టపడే ఆయన తన ముత్తాత ఘనతను ప్రపంచానికి చాటాలని అభిలషిస్తున్నారు. ఝా తండ్రి అసలు జన సామాన్యానికి కనిపించడానికే ఇష్టపడేవారు కారు. కానీ ఈయన మాత్రం వీలైనంతగా జనసామాన్యంతో కలసిపోయే ప్రయత్నమే చేస్తుంటారు ఎప్పుడూ.

కొన్నేళ్లక్రితం తన తండ్రితో కలసి హైదరాబాద్ విమానాశ్రయంలో దిగినప్పుడు తనిఖీ అధికారి తమ పాస్ పోర్టుల్ని చూసి వెంటనే తన తండ్రికి సెల్యూట్ చేసిన విషయాన్ని ఆయన తరచూ గుర్తుచేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ వాసులు ఎప్పటికీ నిజాం కుటుంబం పట్ల, నిజాం వారసులపట్ల అభిమానాన్నీ, ప్రేమనూ, గౌరవాన్నీ చూపుతారనడానికి ఈ సంఘటన ఒక్కటి చాలని ఆయన చెబుతుంటారు.

లండన్ లో నివసించే అజ్మత్ ఝాకు హైదరాబాద్ తో ముడిపడిన అనేక జ్ఞాపకాలున్నాయి. చిన్నతనంలో క్రిస్మస్ సెలవల్లో తను గోల్కొండ కోటను సందర్శించిన రోజులను ఆయన ఇప్పటికీ నెమరువేసుకుంటారు. ఇస్తాంబుల్ లో ఉన్న తన తండ్రి మంచంపట్టడంవల్ల కదలలేని స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మాత్రం ఝా గొంతు గాద్గదికమవుతుంది.

తాజాగా నిజాం అస్తుల గురించి లండన్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎంతో సంతోషంగా ఝా ఆహ్వానించారు. భారతీయులతో ముఖ్యంగా హైదరాబాద్ వాసులతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరునవ్వుతో కదలిపోయే ఆయన నైజం బహుధా ప్రశంశనీయం.

Next Story