ఐఎంఏ హెచ్చరిక.. దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది
By తోట వంశీ కుమార్ Published on 19 July 2020 9:46 AM IST
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతకొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే 10లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హెచ్చరికలు జారీచేసింది. దేశంలో కొవిడ్-19 పరిస్థితి తీవ్రంగా ఉందనీ, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని తెలిపింది.
దేశంలో సగటున రోజుకు 30వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇప్పుడు గ్రామాల్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పట్టణాలు, గ్రామాల్లో వైరస్‌ను నియంత్రించడం కష్టమైన పనేనని ఐఎంఏ హాస్పిటల్ బోర్డు ఆఫ్ ఇండియా డైరెక్టర్ వీకే మోంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ కేంద్ర సాయాన్ని తీసుకోవాలన్నారు. దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలు కాలేదంటూ కేంద్రం చెబుతున్న నేపథ్యంలో ఐఎంఏ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే దేశంలో రెండు మార్గాల ద్వారా కరోనా ను నియంత్రించవచ్చని ఆయన తెలిపారు. మొదటిది.. మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్ సోకితే.. సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. రెండోది.. టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడం అని తెలిపారు.