నేడు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు..
By తోట వంశీ కుమార్
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. బుధవారం రాత్రి 11.40కి ఆయన పార్థివదేహాం సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన ఇంటికి చేరింది. ఈ సందర్భంగా సంతోష్ బాబు అమర్ రహే అంటూ బంధువులు, స్థానికులు పెద్దఎత్తున నివాదాలు చేశారు. సంతోష్ బాబు పార్థివదేహం చూడగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
అంతముందు లద్దాఖ్ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఆర్మీ ఎయిర్ బేస్‌కు బుధవారం రాత్రి 8.40కి కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం గుండా సూర్యాపేటకు తరలించారు. మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పార్థివదేహం వెంట సూర్యాపేటకు చేరుకున్నారు. అంతక్రియల ఏర్పాట్లను మంత్రి దగ్గర ఉండి మరీ పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చే దారిలో చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్, కేతేపల్లి జాతీయ రహదారిపై సమీప గ్రామాల ప్రజలు రోడ్డు మీదకు వచ్చి అమర్ రహే సంతోష్ బాబు, మీ త్యాగం వృధా పోదు అంటూ నినాదాలు చేసి నీరాజనాలు పలికారు. గురువారం తెల్లవారు జము నుంచే కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి జనం నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ సంతోష్ బాబు అంటూ నినాదాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ ముఖాలకు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ కల్నల్ పార్థివ దేహాన్ని సందర్శిస్తున్నారు.
కల్నల్ పార్థివదేహాన్ని ఉదయం 10 గంటల వరకు ప్రజల సందర్శనార్థం సూర్యాపేటలోని ఆయన నివాసంలో ఉంచి, అనంతరం ఆయన స్వస్థలం కేసారం గ్రామానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం కేసారం గ్రామంలో కల్నల్ పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కల్నల్ వీర మరణానికి సంతాప సూచకంగా ఇవాళ సూర్యాపేట పట్టణంలోని వ్యాపార, వాణిజ్య వర్తక సంఘాలు స్వచ్ఛంధంగా బంద్ పాటించనున్నాయి.