ఏపీలో అక్టోబర్ 15 నుంచి కళాశాలలు
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2020 12:13 PM GMTఏపీలో అక్టోబర్ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం జగన్ ఉన్నత విద్యపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబరులో కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించాలని, ఆపై అక్టోబరు 15 నుంచి కాలేజీలు ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 90శాతానికి తీసుకెళ్లాలని, మూడేళ్ల, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్‌షిప్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మరో ఏడాది పాటు స్కిల్ డెవలప్ మెంట్, ఉపాధి కల్పన కోర్సుల బోధన జరపాలని తెలిపారు. ఆ తర్వాతే అది డిగ్రీ ఆనర్స్ గా పరిగణించబడుతుందని సీఎం వెల్లడించారు. అయితే, అడ్మిషన్ సమయంలోనే విద్యార్థి సాధారణ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? లేక ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? అనే దానిపై దరఖాస్తులో ఆప్షన్ ఉంటుందని వివరించారు. విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి అనుమతి ఇచ్చారు. పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు – నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా రంగం మీద తమ ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి .. వీటి గురించి ఆలోచిస్తున్నామన్నారు.