కరోనా బాధితులకు రూ.2వేలు ఆర్థిక సాయం
By తోట వంశీ కుమార్ Published on 15 April 2020 6:04 PM ISTరాష్ట్రంలో కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన 32 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలంటూ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 నియంత్రణా చర్యలను, తాజా పరిస్థితిని ఆయన బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో తెలుసుకున్నారు. మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని, ప్రతి యూనిట్‌లో ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. క్వారంటైన్ సెంటర్ల నుంచి మెడికల్ ప్రోటోకాల్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే పేదలను గుర్తించి వారికి రూ.2000 వేల ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇంటికి వెళ్లాక వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమరిచి చెప్పాలన్నారు.
చికిత్స పొందుతున్న బాధితులకు భోజనం, వసతి లాంటి అవసరాల కోసం రూ.500 కేటాయించాలని సూచించారు. క్వారంటైన్ సెంటర్లలో ఏమేవీ ఉండాలన్ని దానిపై ఎస్ఓపీని దిగువ అధికారులకు పంపించాలన్నారు. రైతులను ఆదుకోవడానికి త్వరిగతిన చేపట్టాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని, వంట నూనెల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2100 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, మరో నాలుగైదు రోజుల్లో రోజుకు 4 వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి చేరుకుంటామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ట్రూనాట్ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌సహా అధికారులు పాల్గొన్నారు.