ఆ ఇద్ద‌రు అధ్యాపకులకు సీఎం కేసీఆర్‌ ప్రశంసలు

By Medi Samrat  Published on  17 July 2020 7:45 AM GMT
ఆ ఇద్ద‌రు అధ్యాపకులకు సీఎం కేసీఆర్‌ ప్రశంసలు

గురువారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం లాంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఈ సందర్భంగా అధికారులు.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు వివ‌రించారు. ఇద్దరు తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని తెలిపారు. దీంతో సీఎం వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

అనంత‌రం సీఎం కేసీఆర్‌.. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, అక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన సదాశివయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. హృదయ పూర్వకంగా అభినందించారు. సదాశివయ్య గారు మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని నేను టీవీల్లో స్వయంగా చూశాను. మీ అంకితభావం గొప్పది. మీకు హృదయ పూర్వక అభినందనలు.

మీరు సంకల్పించినట్లుగానే జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. దానికి కావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మీలాంటి వాళ్లే సమాజానికి కావాలి. ఈ స్పూర్తిని కొనసాగించండి. పాలమూరు యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు పెంచండి. మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న మీ సామాజిక కార్యక్రమాలను కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సిఎం కేసీఆర్ సదాశివయ్యతో అన్నారు. అనంత‌రం బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story