కాంగ్రెస్‌కే ప్రమాదం ..ప్రజలకు కాదు: సీఎం కేసీఆర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 8:59 AM GMT
కాంగ్రెస్‌కే ప్రమాదం ..ప్రజలకు కాదు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని ఎలాంటి ప్రమాదం లేదన్నారు సీఎం కేసీఆర్‌. కేవలం కాంగ్రెస్ మాత్రమే ప్రమాదంలో ఉందన్నారు. శాసనసభలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు సమాధానం చెప్పారు సీఎం కేసీఆర్‌. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ,బిజెపిలకు ప్రజలు సమాధానం చెప్పినా .. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 లో కాంగ్రెస్ కు 21 సీట్లు ఉంటే 2018లో 19 సీట్లకు పడిపోయారన్నారు. బిజెపి సీట్లు నాలుగు నుంచి ఒకటికి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు.

గతంలో జానారెడ్డి చేసిన ప్రకటనలలే భట్టి చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రక్రియే మొదలు కాలేదన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులను చేస్తోందని ..భట్టి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్ని జిల్లాల ప్రజల మద్దతుందన్నారు . బడ్జెట్ పై తాను మాట్లాడిన తర్వాత వందల ఫోన్‌లు వచ్చాయన్నారు. పక్క రాష్ట్రంలో ఎన్నికల ముందు తాయిలాలు ఇచ్చి భంగపడ్డారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఎన్నికల టైమ్ లో ఒక్క జిల్లా కలెక్టర్ , ఎస్పీతో కూడా మాట్లాడలేదన్నారు. డీజీపీతో అసలు టచ్‌లోకే వెళ్లలేదన్నారు. సిఈఓ చేసిన ప్రకటనను అమలు చేయండని మాత్రమే చెప్పానన్నారు. తమ పార్టీ పుట్టిందే సాహసం మీదన్నారు సీఎం కేసీఆర్‌. పార్టీ పెట్టినప్పుడే రాజీనామాలతో ఆరంభించామన్నారు. కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి పదవులు ,ఎమ్మెల్యేల, ఎమ్.పి పదవులు వదలుకున్నామని..దేశ చరిత్రలోనే ఇదో రికార్డు అని గుర్తు చేశారు సీఎం కేసీఆర్‌.

Next Story
Share it