ఒళ్లు వంచి పని చేస్తే ఫలితాలు ఇలానే ఉంటయ్‌..

By అంజి  Published on  25 Jan 2020 12:28 PM GMT
ఒళ్లు వంచి పని చేస్తే ఫలితాలు ఇలానే ఉంటయ్‌..

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పట్టం కట్టారని సీఎం కేసీఆర్‌ అన్నారు. మీ లక్ష్యం కోసం మీరు పని చేయండి అని ప్రజలు ఆదేశించారన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కేసీఆర్‌ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ప్రతి ఎన్నినకల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలవడం ఆనవాయితీగా మారిందన్నారు. కానీ విపక్షాలు మున్సిపల్‌ ఎన్నికలను ఆపేందుకు విశ్వప్రయత్నం చేశాయని, ప్రతిపక్షాల విమర్శలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాల చెంప చెళ్లుమనించారని, ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపకుంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయిన ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యనించారు. తెలంగాణ ప్రజల తీర్పును ప్రతిపక్షాలు అవమానిస్తున్నాయని, ప్రతిపక్షాలను ఓటర్లు కిందపడేసి తొక్కుతున్నా మార్పు రావడం లేదన్నారు. చాలా కష్టపడ్డాం కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయన్నారు.

పార్టీ మెటీరియల్‌ కోసం రూ.80 లక్షల నుంచి కోటి మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ప్రజలిచ్చిన విజయం బాధ్యతను మరింత పెంచిందన్న ఆయన.. త్వరలో తెలంగాణ పట్టణప్రగతి చేపడతామన్నారు. గెలిచిన కౌన్సిలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోందని, ఆర్బనైజేషన్‌కు అనుకూలంగా కార్యక్రమాలు రూపొందిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ప్రతి ఏటా హైదరాబాద్‌కు అదనంగా 6 లక్షల మంది వస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని, ఐటీ రంగం బాగా విస్తరించబోతోందన్నారు. పట్టణీకరణ వల్ల వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మార్చి తర్వాత 57 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్‌ అందిస్తామని కేసీఆర్‌ తెలిపారు. త్వరలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచుతామన్నారు.

కేంద్ర ప్రభుత్వం సరిగ్గా పని చేయడం లేదని కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణకు రూ.1,131 వేల కోట్ల జీఎస్టీ బకాయి ఉందన్నారు. కేంద్రం మాటలు కోటలు దాటుతున్నాయని.. చేతలు మాత్రం వేరేలా ఉన్నాయన్నారు. పరిమితులను బట్టి పీఆర్‌సీని అమలు చేస్తామన్నారు. గత ఐదేళ్లు దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా 21 శాతం వృద్ధి నమోదైందని, ప్రస్తుతం విపత్కర పరిస్థితి నెలకొనిందన్నారు.

సీఏఏపై సీఎం కేసీఆర్‌..

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. మౌనంగా ఉండటం దేశానికి క్షేమం కాదని, సీఏఏను కేంద్రం వెనక్కు తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం ఉండాలని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యనించారు. భారతదేశం ప్రజల దేశంగా ఉండాలని.. మతదేశం కాకూడదన్నారు. సీఏఏ వంద శాతం తప్పుడు బిల్లు అని, సీఏఏపై ప్రధాని మోదీ పునరాలోచించాలని ఆయన పేర్కొన్నారు. అమిత్‌ షా ఫోన్‌ చేసినప్పుడు మద్దతు ఇవ్వబోమని చెప్పామన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సీఎంలతో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతిచ్చామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

భైంసాలో జరిగింది దుర్మార్గమేనని, అల్లర్లను అదుపు చేసి ఎన్నికలు జరిపించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తనకన్నా మించిన హిందూ ఎవరూ లేరని ఆయన పొగుడుకున్నారు. బీజేపీలా తలుపు దగ్గర పెట్టుకొని పూజలు చేయనని సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

Next Story