సీఎం కేసీఆర్.. విపక్షాలకు అవకాశం ఇచ్చారా.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Aug 2020 6:17 AM GMTఏ బంతిని ఎలా కొట్టాలో మంచి క్రికెటర్ కు తెలుస్తుంది. అయితే.. ఆ బంతిని.. తనకు అనుకూలంగా మార్చుకొని సిక్సర్ గానో.. ఫోర్ గానో మలుచుకునే టాలెంట్ ఉన్నవారు అద్భుతమైన క్రికెటర్లుగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటారు. క్రికెట్ లో బౌలర్ విసిరిన బంతిని డీల్ చేయటంలోనే టాలెంట్ అంతా దాగి ఉంటే.. రాజకీయాల్లో నేతలు ఎవరైనా కావొచ్చు.. తమకు ఎదురయ్యే పరిస్థితుల్ని సమయానికి అనుగుణంగా డీల్ చేయటంలోనే అసలు విషయం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడెలా వ్యవహరించాలో.. ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. ప్రత్యర్థుల నోటి నుంచి మాట రాకుండా చేయటంలోనూ ఆయనకున్న టాలెంట్ గురించి ఎవరూ తక్కువగా చెప్పలేరు. ఏదైనా అనుకోని పరిణామం చోటు చేసుకుంటే.. ఇప్పటివరకు ఎవరూ చేయనట్లుగా పరిహారాన్ని ప్రకటించటంలో కేసీఆర్ స్టార్ట్ చేసిన ట్రెండ్ కొత్త పుంతల్ని తొక్కించింది.
ఆయన తీరును.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఫాలో అయ్యే పరిస్థితి.మొన్నటికి మొన్న విశాఖలోని ఎల్ జీ పాలిమార్స్ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు జగన్ సర్కారు కోటి రూపాయిల పరిహారాన్ని ప్రకటించటం ద్వారా.. విపక్షాల నోటి నుంచి మాట రాకుండా చేశారు. నిజానికి దీనికి స్ఫూర్తి సీఎం కేసీఆరే. గతంలో తెలంగాణలో ఏదౌనా దుర్ఘటన చోటు చేసుకుంటే భారీగా పరిహారాన్ని ప్రకటిస్తుంటారు.
అలాంటి ఆయన.. తాజాగా శ్రీశైలం ప్రమాద బాధితుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది. ప్రమాదంలో మరణించిన డీఈ కుటుంబానికి రూ.50 లక్షలు.. ఏఈ కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. నిజానికి ఈ ఘటనలోని బాధితులకు ఎదురైన ప్రమాదం ఊహకు అందనిది. దారుణ దుర్ఘటనగా చెప్పే ఈ ఉదంతంలోని మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటిస్తారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.
అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ మాత్రం.. చాలా తక్కువ మొత్తాన్ని ప్రభుత్వ సాయంగా ప్రకటించారు. దీనిపై విపక్షాలు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఉదంతాల్లో విపక్షాలకు అవకాశం ఇవ్వని రీతిలో నిర్ణయాలు తీసుకునే అలవాటున్నకేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలిసిన కేసీఆర్.. తాజాగా మాత్రం విపక్షాలకు అవకాశం ఇవ్వటంపై విస్మయం వ్యక్తమవుతోంది.