ఆసక్తికరంగా 'అధినేత‌'ల ప‌నితీరు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 July 2020 9:47 AM GMT
ఆసక్తికరంగా అధినేత‌ల ప‌నితీరు

రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల‌ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఎదురుకాని అరుదైన పరిస్థితి చోటుచేసుకున్న వేళలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నప్పుడు.. పక్కింట్లోనూ తమ ఈడు పిల్లలే ఉంటే పోలిక ఎంత సహజమో.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల విషయంలోనూ తెలుగు ప్రజలు పోలికలు పోల్చుకుంటున్నారు.

కరోనా విషయంలో ఇద్దరి ముఖ్యమంత్రుల వ్యవహారశైలి ఇప్పుడు రాజకీయ అంశంగా కూడా మారింది. దేశంలో అందరికంటే ముందే కరోనా ప్రభావాన్ని అంచనా వేసిన కేసీఆర్.. తానే ముందుగా లాక్ డౌన్ ను విధించటం తెలిసిందే. వరుస పెట్టి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో పోల్చినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న విమర్శలు వినిపించాయి.

ఒక సుదీర్ఘ మారథాన్ లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు ఎవరూ కూడా తమ శక్తి సామర్థ్యాల్ని ఒక్కసారిగా ఖర్చు పెట్టటానికి ఇష్టపడరు. అది మంచి వ్యూహం కూడా కాదు. అందులోకి అంటువ్యాధుల్లాంటి విపత్తు ఇటీవలకాలంలో మనం చూసింది లేదు. ఇలాంటప్పుడు అడుగులు నెమ్మదిగా వేస్తూ.. దాని గురించి అవగాహన పెంచుకోవటంతో పాటు.. మనకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం. ఈ విషయంలో కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తే.. జగన్ మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్లుగా వ్యవహరించారు.

కరోనా వేళ తనకున్న పరిమితుల్ని త్వరగానే అర్థం చేసుకున్న కేసీఆర్.. కాసింత నిరాశ చెందారనే చెప్పాలి. ఇలాంటి విపత్తుల్లో ఇమేజ్ గురించి ఆలోచిస్తే.. నిధుల కొరతను ఎదుర్కోవటంతో పాటు మరిన్ని సమస్యలు తప్పవన్న విషయాన్ని గుర్తించినట్లున్నారు. ఈ కారణంతోనే ఎంతవేగంగా లాక్ డౌన్ విధించారో.. అంతే వేగంగా ఆన్ లాక్ ప్లాన్ ను అమలు చేసే దిశగా ఆయన అడుగులు వేశారన్న మాట వినిపిస్తోంది. దీనికి భిన్నంగా జగన్ వ్యవహారశైలి కనిపించక మానదు.

ఓవైపు కరోనా మరోవైపు కీలక నిర్ణయాల దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. కరోనా మహమ్మారితో సహజీవనం చేస్తూ సాగిపోవటమే తప్పించి మరో మార్గం లేదన్న విషయాన్ని దేశంలో అందరి కంటే ముందే తేల్చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఈ విపత్తు కాలంలో ఏం చేయాలన్న విషయం మీద స్పష్టతతో అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇందులో భాగంగానే పదవుల భర్తీతో పాటు.. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాల దిశగా పయనిస్తున్నారు. సాధారణంగా సానుకూల వాతావరణం ఉన్న వేళలోనే కొత్తజిల్లాల ఏర్పాటు లాంటి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటారు. అందుకు భిన్నంగా.. విపత్తులో ఉన్న వేళలోనే కొత్త జిల్లాల లెక్క తేల్చేయాలన్న సంగతి చూస్తే.. తానేం చేసే ప్రతి విషయం మీద పూర్తిస్థాయి స్పష్టతతోనే జగన్ అడుగులు వేస్తున్నట్లుగా చెప్పాలి.

కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులు వేసి త్వరగా అలసిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన తొలుత బాగా పని చేసినట్లుగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం చేతులెత్తేశారన్న అపప్రదను మూట కట్టుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తొలుత ప్రతికూలతను ఎదుర్కొన్నా.. ఆయన అనుసరిస్తున్న విధానాలే సరిగా ఉన్నాయన్న పేరును సొంతం చేసుకున్నారు.

ఇవాళ్టి రోజున ఏపీ నుంచి తెలంగాణకు రావటం తేలికే కానీ.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లటం మాత్రం అంత సులువైన విషయం కాదంటున్నారు. పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్న వేళ‌ తెలంగాణలో కంటైన్మెంట్ కేంద్రాల్ని ఏర్పాటు చేసే తీరు.. ఏపీలో అనుస‌రిస్తున్న తీరు గమనార్హం. ఇదంతా చూసినప్పుడు ఏపీ ప్రభుత్వం కరోనా విషయంలో ఏమేం చేయాలన్న దానిపై ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తుంటే.. తెలంగాణ సర్కారు మాత్రం కాస్తా తడబడుతుంద‌నే వాద‌న‌లూ విన‌బ‌డుతున్నాయి.

Next Story