Fact Check : యాదాద్రి ఆలయంలో కేసీఆర్ చెప్పులు వేసుకుని తిరిగారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు యాదాద్రి ఆలయాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే..! ఆయన ఆలయాన్ని పరిశీలించిన తర్వాత సందర్శనకు సంబంధించిన పలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఆయన ఆలయ సందర్శనార్థం వచ్చిన తర్వాత చెప్పులతో అక్కడ తిరిగారంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో చెప్పులు ధరించకూడదని.. కానీ వాటిని కేసీఆర్ పట్టించుకోకుండా ఆలయంలో చెప్పులతో తిరిగారంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.
కేసీఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పలువురు సామాజిక మాధ్యమాల్లో ఆరోపిస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
యాదాద్రి ఆలయంలో కేసీఆర్ చెప్పులు వేసుకుని తిరిగారన్నది 'పచ్చి అబద్ధం'.
‘KCR in Yadadri’ అని గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఆయన యాదాద్రి టూర్ కు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు లభించాయి.
Telangana Today ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదివారం మధ్యాహ్నం 12:30 సమయంలో ఆలయ పండితులు పూర్ణ కుంభంతో, వేద మంత్రాల నడుమ స్వాగతించారు. బాలాలయంలో పలు ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. ఆళ్వార్ లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని, ఆండాళ్ ఆలయాలను పరిశీలించారు. ప్రాకారాలలో ఉన్నటువంటి ధ్వజస్థంభాలను కూడా అయన పరిశీలించారు. క్యూ లైన్లను, కళ్యాణ మండపాలను, లోపలి ప్రాకారాలను కూడా పరిశీలించారు. ఆలయంలోని లైటింగ్ సిస్టమ్ గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్.
దాదాపు ఆరు గంటల పాటూ కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు.
Times now news కథనం ప్రకారం పలు అంశాలపై సూచనలు ఇచ్చారు కేసీఆర్. ట్రాన్స్పోర్ట్, ఆలయం చుట్టుపక్కల పచ్చదనం, కాంప్లెక్స్ ల నిర్మాణాలు వంటివి అధికారులతో చర్చించారు కేసీఆర్.
కేసీఆర్ యాదాద్రి పర్యటనను పలు తెలుగు మీడియా సంస్థలు లైవ్ ఇచ్చాయి.
ఈ వీడియోలను పరిశీలించగా.. కేసీఆర్ ఆలయం లోపల ఎక్కడ కూడా చెప్పులు వేసుకుని కనిపించలేదు. ఎక్కడైతే నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయో.. అక్కడ మాత్రమే కేసీఆర్ చెప్పులు వేసుకుని కనిపించారు.
�
వైరల్ అవుతున్న ఫోటోను సాక్షి న్యూస్ లో చూడొచ్చు. అదే ప్రాంతంలో తీసిన ఫోటోలలో కేసీఆర్ తో పాటు.. మిగిలిన అధికారులు కూడా షూలను వేసుకుని కనిపించారు.
యాదాద్రి ఆలయంలో కేసీఆర్ చెప్పులు వేసుకుని తిరిగారన్నది 'పచ్చి అబద్ధం'.