ఇక సీఎంలు ఎందుకు..? ప్రభుత్వాలు ఎందుకు..?

By అంజి  Published on  15 March 2020 10:32 AM GMT
ఇక సీఎంలు ఎందుకు..? ప్రభుత్వాలు ఎందుకు..?

అమరావతి: కరోనాపై పెద్దగా టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు ఉన్నారని, కరోనా వైరస్‌ ఇతర దేశాల నుంచి అన్ని దేశాలకు పాకుతోందన్నారు. డయాబెటిక్‌, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులు ఉన్నవారికే వస్తేనే ఇది హానికరమైన వ్యాధిగా పరిగణించాలన్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రెస్‌ మీట్‌ పెట్టాలని తాను ఊహించలేదని సీఎం జగన్‌ అన్నారు. కొన్ని విషయాలు, వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాలంటూ.. స్థానిక ఎన్నికల వాయిదాపై మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వ్యవస్థలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యనించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జోరు చూసి టీడీపీకి భయం పట్టుకుందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చదివి వినిపిస్తున్నారని, సీఎస్‌, హెల్త్‌ సెక్రటరీని కూడా అడగకుండా ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తాము నియమించలేదని, చంద్రబాబు హయాంలోనే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నియమితులయ్యారని అన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్‌ఈసీ పదవిలోకి తెచ్చుకున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

Also Read: గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. ఎన్నికల వాయిదాపై చర్చ?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తన విచక్షణ కోల్పోయి మాట్లాడారని అన్నారు. కులం, మతం, ప్రాంతం అనే స్వార్థాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉండొద్దని, నిష్పక్షపాతంగా ఈసీ వ్యవహరించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలను ఏకపక్షంగా ఎలా తప్పిస్తారని సీఎం జగన్‌ ప్రశ్నించారు. ఈసీ రమేశ్‌ కుమార్‌ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని చెప్తూనే.. మరో వైపు అధికారులను బదిలీ చేస్తున్నారని అన్నారు. అధికారులను తప్పించే అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఈసీని సీఎం జగన్‌ ప్రశ్నించారు.

'తమది ప్రజలు ఓట్లేస్తే గెలిచిన పార్టీ అని.. అయితే ఈ అధికారం రమేశ్‌కుమార్‌దా.. మాదా.. క్లారిటీ ఉండాలన్నారు. ఇష్టం వచ్చినట్లు ఎన్నికలు వాయిదా వేస్తున్నారు.. ఏదైనా అంటే విచక్షణాధికారాలు అంటారు. ఆశ్చర్యం వేస్తోంది.. ఈ ప్రజాస్వామ్యం ఎందుకు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తామంటే వద్దని ఆదేశించారు. మా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నారు.. ఈ నిర్ణయంపై ఎవరితోనైనా చర్చించారా?' అంటూ సీఎం జగన్‌ ప్రసంగించారు.

Also Read:ఎస్ఈసీ సీరియస్‌.. ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీలతో సహా..

రివ్యూ చేయాలి కదా?

నిజంగానే కరోనా కారణంగా పరిస్థితి చేయిదాటిపోతే.. రివ్యూ చేయాలి కదా?, సంక్షేమ పథకాలు ఇస్తామంటే వద్దంటావ్‌.. ఏమిటి? చంద్రబాబు నీకు పదవి ఇచ్చి ఉండొచ్చు.. కానీ ఇంత వివక్ష కరెక్టేనా.? అని అంటూ ఈసీని సీఎం జగన్‌ సూటిగా ప్రశ్నించారు. కేవలం 43 చోట్ల మాత్రమే చిన్న చిన్న ఘటనలు జరిగాయన్నారు. 54,940 మంది నామినేషన్లు అన్ని పార్టీల వాళ్లు దాఖలు చేశారని అన్నారు. ఇక పోలీసుల గురించి గర్వంగా చెబుతానన్నారు. పోలీసులు ఎక్కడా కూడా ప్రేక్షక పాత్ర వహించలేదన్నారు. కరోనాతో వాయిదా వేస్తున్నారు.. రాబోయే రోజుల్లో మెరుగవుతుందా అని జగన్‌ సూటిగా అడిగారు.

'పంచాయతీ నిధులు వెనక్కి వెళ్తే.. మంచి పద్దతేనా.? ఈ విషయాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఎన్నికల కమిషనర్‌ను పిలిపించి మాట్లాడాలని కూడా చెప్పాం. ఆయనలో మార్పు రాకపోతే పైస్థాయికి కూడా వెళ్తాం' అని సీఎం జగన్‌ అన్నారు.

Next Story
Share it