ఎస్ఈసీ సీరియస్‌.. ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీలతో సహా..

By Newsmeter.Network  Published on  15 March 2020 9:28 AM GMT
ఎస్ఈసీ సీరియస్‌.. ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీలతో సహా..

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అదే సమయంలో నామినేషన్ల సమయంలో అధికారుల నిర్లక్ష్యంపైనా కొరడా ఝుళిపించింది. నామినేషన్‌ల ప్రక్రియలో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికితోడు ప్రతిపక్ష తెదేపా నేతలు తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని, పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

దీనికితోడు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే బీజేపీ, జనసేన నేతలుసైతం వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు చేసిన దాడులకు సంబంధించిన వీడియోలుసైతం ప్రసార మాద్యమాల్లో ప్రసారమయ్యాయి. తమకు వచ్చిన ఫిర్యాదులు, ప్రసార మాద్యమాల్లోని కథనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక సంఘటనలు నిలువరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేయడంతో పాటు పలువురి అధికారులను స్థాన చలనం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

అదే విధంగా మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉదాసీన వైఖరితో కేసులు నమోదు చేసి, నిందుతులకు వెంటనే స్టేషన్‌ బెయిల్‌ను మంజూరు చేసిన ఘటనలో సీఐను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గుంటూరు కలెక్టర్‌, చిత్తూరు కలెక్టర్‌, గుంటూరు ఎస్పీ, చిత్తూరు ఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, పలమనేరు డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అదేవిధంగా మాచర్ల ఘటనపై నిర్లక్ష్యం వహించిన సీఐను సప్పెండ్‌ చేయడంతో పాటు తిరుపతి సీఐ, పలమనేరు సీఐ, రాయదుర్గం సీఐ, తాడిపత్రి సీఐలను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈసీ నిర్ణయంతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు గవర్నర్‌తో భేటీ అయిన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Next Story
Share it