ఇప్పటి వరకు రాష్ట్రంలో 74,551 టెస్టులు : సీఎం జగన్
By తోట వంశీ కుమార్ Published on 27 April 2020 7:58 PM ISTదేశంలోనే కరోనా పరీక్షలు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్నామని, ప్రతి 10లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామన్నారు. కరోనాకు ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీఎల్ ల్యాబ్ కూడా లేదని, ఇప్పడు 9 వీఆర్‌డీఎల్, 44 ట్రూనాట్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్ పై ప్రభుత్వం చేపట్టిన చర్యలను సోమవారం రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 74,551 టెస్టులు చేశామని తెలిపారు.
కరోనాకు సంబంధించిన విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు క్రిటికల్ ఆస్పత్రులను ఏర్పాటు చేశామని, కరోనా కేసుల సంఖ్యను బట్టి ఇప్పటికే మండలాను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించామని తెలిపారు. రెడ్‌జోన్‌లో 63, ఆరెంజ్ జోన్‌లో 54, గ్రీన్ జోన్‌లో 559 మండలాలున్నాయని పేర్కొన్నారు. ఇక క్వారంటైన్‌లో ఉన్నవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నాని, కరోనా చికిత్సకు సంబంధించిన ఆస్పత్రులకు ప్రత్యేకంగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను దాదాపుగా పూర్తిచేశామన్నారు. ఇంకా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
కరోనా సోకితే.. అంటరాని తనమనో, అదో భయంకరమైన రోగమనో అనే భావనను అందరూ తీసేయాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుందని, రాబోయే రోజుల్లో సహజంగా అందరికీ వచ్చే పరిస్థితి ఎక్కువగా ఉంటుందని తెలిపారు.కరోనా ఉన్నట్లుగా 80శాతం మందికి తెలియనే తెలియదని, ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా వ్యాపిస్తుందన్నారు. కరోనా సోకిన వారిలో 81 శాతం మందికి ఇంట్లో ఉంటే చాలు నయమైపోతోందిని, కేవలం 14 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. మనలో రోగ నిరోధకశక్తి పెంచుకునేలా ఆహారపు అలవాట్లు ఉండాలని, అప్పుడే కరోనా ధైర్యంగా ఎదుర్కోవచ్చునని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటకే 14410 ప్రత్యేకంగా టెలీమెడిసిన్ కాల్ సెంటర్‌ను ప్రారంభించామని, ఈ కాల్ సెంటర్ ద్వారా కరోనా కేసులే కాకుండా మిగతా వ్యాధులకు చికిత్స అందించేలా చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడుసార్లు సర్వే నిర్వహించామని, ఆర్థికలోటు ఉన్నా.. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.