కరోనా వస్తుంది పోతుంది.. రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయటం లేదు : సీఎం జగన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2020 10:09 AM GMT
కరోనా వస్తుంది పోతుంది.. రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయటం లేదు : సీఎం జగన్‌

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నా సరే.. రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసులు ఎక్కువ అవుతున్నా రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని, ఈ రోజు కూడా ఆరు వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారన్నారు.

రోజువారి చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, నిత్యం 50వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదేనని ఉద్ఘాటించారు. ప్రతి 10లక్షల మందిలో 31వేల మందికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 90శాతం పరీక్షలను కొవిడ్‌ క్లస్టర్లలోనే చేస్తున్నామని వివరించారు. కరోనా విషయంలో అధికారులు బాగా పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.5శాతంగా ఉంటే రాష్ట్రంలో 1.06 శాతంగా ఉందన్నారు. కొవిడ్‌ తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ వైరస్‌ వస్తుంది.. పోతుంది. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ వేచి చూడాలన్నారు. మన దగ్గర లక్షకు పైగా కేసులు నమోదైతే.. అందులో సగం మందికి నయం అయిందన్నారు. 85 శాతం మందికి ఇళ్లలోనే నయం అవుతున్న పరిస్థితులు ఇళ్లల్లో కనిపిస్తున్నాయని.. అవగాహాన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు.

ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు ఉంచాలని, కాల్‌సెంటర్ల పనితీరును అధికారులు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. "సంబంధిత వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? తనిఖీ చేయాలి. కాల్‌చేయగానే స్పందించే తీరును కచ్చితంగా పర్యవేక్షించాలి. ఆ నంబర్లు సరిగ్గా పని చేస్తున్నాయా? లేదా? చెక్‌ చేయాలి "అని సీఎం సూచించారు. కోవిడ్‌ పాజిటివ్‌ కేసును గుర్తించిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితులు ఆధారంగా.. హోం క్వారంటైన్ లేదా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి లేదా రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులకు వీరిని పంపిస్తామన్నారు. హోంక్వారంటైన్‌ కోసం ఇంట్లో వసతులు ఉంటే రిఫర్‌ చేస్తామని, ఇంట్లో ప్రత్యేక గది లేని పక్షంలో వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రిఫర్‌ చేయడం జరుగుతుందన్నారు.

Next Story