ముఖ్యాంశాలు

► గంటన్నర పాటు ప్రధానితో భేటీ

► కీలక అంశాలను ప్రస్తావిస్తూ మోదీకి లేఖ అందజేత

► సానుకూలంగా స్పందించిన మోదీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి జగన్‌ నివేదించారు. ఈ మేరకు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు డిమాండ్లతో కూడిన లేఖను జగన్‌ ప్రధాని మోదీకి అందజేశారు. ఏపీలో ఉగాది పండగ రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా ప్రధానిని సీఎం కోరారు. అలాగే నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో దీనిని చేపట్టినట్లు జగన్‌ వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరిన జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖను ఆదేశించాలని జగన్‌ ప్రధానిని కోరారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి

పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55549 కోట్లకు చేరిందని, అందులో ఆర్అండ్‌ఆర్‌ కోసమే రూ. 33010 కోట్లు అవసరమని జగన్‌ వివరించారు. కేంద్ర జవనరుల శాఖలో సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ. 55549 కోట్లుగా ఫిబ్రవరి 2019న అంచనాలు వేసిన అంశాన్ని ప్రధానికి వివరించిన జగన్‌.. దీనికి పరిపాలనా పరమైన అనుమతులు అందలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ. 3320 కోట్లు రావల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం  సిఫార్సులతో అవసరం లేదని, 15వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాలన్ని వినతి పత్రంలో పేర్కొన్నారు.

రెవెన్యూ లోటు

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర సర్కార్‌ అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందన్నారు. ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందన్నారు. వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలని జగన్‌ ప్రధానిని కోరారు

Cm Jagan Meet

గ్రాంట్లు విడుదల

ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.10.610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలోని ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువేనని, పెండింగ్‌లో ఉన్న గ్రాంట్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు. కృష్ణా -గోదావరి నదుల అనుసంధానానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇక రాజధాని నిర్మాణానికి రూ. 2500 కోట్లు కేటాయిస్తే, కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడదుల చేశారని, మిగిలిన నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ కోరారు

వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు

గడిచిన ఆరేళ్లలో ఏడు జిల్లాలకు కేవలం రూ. 1050 కోట్లు మాత్రమే అందించారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు లేవని జగన్‌ గుర్తు చేశారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌, కలహండి నమూనాలోనిధులు ఇవ్వాలని కోరారు.

హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు

హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

శాసన మండలి రద్దు అంశంపై..

ఇక ఇటీవల శాసన మండలిని రద్దు చేసిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు జగన్‌. గడిచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసన మండలి ప్రజల మంచి కోసం మెరుగైన పాలన కోసం ప్రతిపక్షం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిందిపోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రజలు ఎన్నుకున్నా.. ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతులు మెజార్టీ ఏపీ అసెంబ్లీ శాసన మండలిని రద్దు చేస్తూ రికమండ్‌ చేసిందన్నారు. తదనంతరం చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని సీఎం జగన్ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు.

ఏపీ దిశ చట్టం

ఏపీ దిశ చట్టం -2019కి ఆమోదం తెలపాలని జగన్‌ కోరారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశచట్టం-2019పై అనేక మంది ప్రశంసలు కురిపించారని ప్రధానికి వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. జగన్‌ ప్రస్తావించిన అంశాలపై మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఈ భేటీలో సీఎం జగన్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్‌, భరత్‌, నందిగం సురేష్‌, శ్రీకృష్ణదేవరాయులు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్‌, చింతా అనురాధ,వంగ గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.