వాట్ ఏ ప్లాన్ జగన్ జీ.. అటు ఇటు చేసి బీజేపీని ఇరికించావుగా.!
By అంజి Published on 22 Jan 2020 8:59 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పని చేసినా కేంద్రానికి చెప్పే చేస్తున్నామని ఆ మధ్య చాలా సందర్భాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతూ ఉండేవారు. అదంతా పార్టీ వ్యూహమేనని అనేవాళ్లూ ఉన్నారు. మరోపక్క మాత్రం వైసీపీతో బీజేపీనే ఇదంతా చేయిస్తుందని కూడా అంటున్నారు.
ఇప్పుడు రాష్ట్రాన్ని కకా వికలం చేస్తున్న మూడు రాజధానుల అంశం కూడా కేంద్రానికి చెప్పే వైసీపీ సర్కార్ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఈ విషయమే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. ఇదంతా నిజంగానే కేంద్రానికి చెప్పి చేస్తుందా..? లేక పార్టీకి చెప్పకుండా చేసకుంటూ పోతుందా..? చెప్పకుండానే చెప్పి చేస్తున్నట్టుగా చెప్తుందా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం కాకరేపుతోంది. ఏకపక్షంగా చేపట్టిన మూడు రాజధానులకు బీజేపీ మద్దతు లేదని, ఆ పార్టీ రాష్ట్రశాఖ స్పష్టంగా చెప్తోంది. తాము అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు ఇస్తామేతప్పా, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతు ఇచ్చేది లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదంటున్నారు జనాలు. ఇదే అంశంలో తాము ప్రతీ విషయాన్ని కేంద్రానికి చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి అంటున్నారు.
అది బీజేపీని ఇరికించడానికి వైసీపీ చేస్తున్న ప్రచారంగా రాష్ట్ర స్థాయి నేతలు చెప్తున్నారు. ఇదంతా చూస్తున్న జనాలు మాత్రం అసలేం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పష్టత లేకుండా రాష్ట్ర నాయకులు చెప్పిందే ఫైనల్ అని ఎలా అనుకుంటామని అంటున్నారు ప్రజలు.
ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఓ ఆంగ్ల పత్రికలో ఇదే విషయం ప్రధానంగా ప్రచురితమైంది. దీనిపై ఢిల్లీలోని బీజేపీ నాయకుడు సునీల్ ధియోదర్ ట్విటర్‌లో స్పందించాడు. మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రంలోని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో చర్చించామని, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ తీరును తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న మూర్ఖపు చర్యలను సమర్ధించుకోలేక కేంద్రంతో చర్చించామని, తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
ఈ తతంగాన్నంతటిని గమనిస్తున్న జనాలు ఇదేం విడ్డూరం..! అసలు విషయంపై ఇంత వరకు పార్టీ నిర్ణయాన్ని చెప్పకుండా ఖండిస్తున్నామంటే సరిపోతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. అసలు బీజేపీ నేతలు ఖండిస్తున్నది కేంద్ర ప్రభుత్వాన్ని ఇరికించడాన్నా..? లేక మూడు రాజధానుల నిర్ణయాన్నా..? అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఈ విషయంలో బీజేపీని ఇరికించేందుకే వైసీపీ ప్రయత్నిస్తుందని కొందరు అంటుంటే, అసలు కేంద్రం సపోర్ట్ లేకుండా జగన్ ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకుని ఉండలేరేమో అని మరికొందరు అనుకుంటున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్‌ను సెంటర్ చేసి వైసీపీ తన నిర్ణయాలను అమలు చేసుకోవాలని చూస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద వైసీపీ ఈ విషయంలో ఆడుతున్న చెలగాటం కేంద్రంలోని బీజేపీకి ప్రాణ సంకటంలా మారినట్టుందని రాజకీయ విశ్లేషకుల భావన.