Fact Check : మీర్ పేట్ పెద్ద చెరువుకు గండి పడిందంటూ కథనాలు నిజం కాదు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 11:54 AM ISTహైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. చాలా చెరువులు నిండిపోయాయి. ఇంకా నగరానికి వర్షం ముప్పు పొంచి ఉంది. గత కొద్ది రోజులుగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. 'మీర్ పేట్ లోని పెద్ద చెరువుకు గండిపడిందని.. చుట్టుపక్కల కాలనీల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. వీలైనంత తొందరగా పెద్ద చెరువు చుట్టు పక్కల ఉన్న వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్వీట్లు కూడా చేస్తున్నారు.
మీర్ పేట్ పెద్ద చెరువుకు గండి అంటూ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సప్ లో వైరల్ చేస్తూ ఉన్నారు. నేషనల్ న్యూస్ పేపర్లు, ఛానల్స్ లో పని చేసే జర్నలిస్టులు కూడా ఈ వార్తను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
హైదరాబాద్ మీర్ పేట్ లోని పెద్ద చెరువు బండ్ కు గండి పడిందన్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న వీడియోల్లో మీర్ పేట్ ప్రాంతంలో భారీగా నీరు వచ్చిన దృశ్యాలను గమనించవచ్చు. ఈ వీడియోలు గత వారంకు చెందినవి. ఇప్పటివి కావు.. అక్టోబర్ 18న పడిన వర్షాలకు చెందిన వీడియో కాదు. ఈ నెలలో కురిసిన వర్షాలకు మీర్ పేట్ ప్రాంతంలోకి వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉన్నాయి.
‘Meerpet lake broken out in Meerpet Colony, Hyderabad Floods.’ అంటూ యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోను షేర్ చేయడం జరిగింది.
పోలీసు డిపార్ట్మెంట్, ఉన్నతాధికారులు ఈ వార్తలను ఖండిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. మీర్ పేట్ లోని పెద్ద చెరువు బండ్ కు గండి పడలేదని.. పరిస్థితి అదుపు లోనే ఉందని తేల్చి చెప్పారు.
రాచకొండ పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను పోస్టు చేశారు. సీపీ రాచకొండ, ఏసీపీ వనస్థలిపురం, ఎస్.హెచ్.ఓ. మీర్ పేట్, మున్సిపల్ కమీషనర్, మేయర్, మినిస్టర్ సబితా ఇంద్రా రెడ్డి మీర్ పేట్ బండ్ ను పరిశీలించారని ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ద్వారా తెలుస్తోంది. సీపీ మహేష్ భగవత్ ఇలాంటి వదంతులను నమ్మకండని ప్రజలను కోరారు.
ETV Telangana లో కూడా ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ అక్టోబర్ 20, 2020న కథనాన్ని ప్రసారం చేశారు. పెద్ద చెరువు బండ్ కు గండి పడలేదని.. అక్కడ ఉన్న చిన్న చెరువు నిండిపోవడంతో నీరు బయటకు వస్తూ ఉన్నాయని తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో పాతది.. ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో అప్పటి వీడియో. అక్టోబర్ 20, 2020న ఈటీవీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలో నీటి ఉధృతి తగ్గి ఉండడాన్ని గమనించవచ్చు.
మినిస్టర్ సబితా ఇంద్రా రెడ్డి కూడా ఈ వదంతులను ఖండించారు.
మీర్ పేట్ లోని పెద్ద చెరువు బండ్ కు గండి పడిందన్న పోస్టులు నిజం కాదు.