ఏపీలో ఆ గ్రామం ఇప్పుడు ప్రపంచానికే రోల్ మోడల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 8:01 AM GMT
ఏపీలో ఆ గ్రామం ఇప్పుడు ప్రపంచానికే రోల్ మోడల్..!

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చోడవరం గ్రామం అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందింది. మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో అందించాల్సిన సేవల గురించి అధ్యయనం చేయడానికి 19 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. డిఆర్డీయే, జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నడిచే ఈ గ్రామ సచివాలయం ఇకపై రికార్డులకు వేదికగా నిలవబోతోంది.

ఈ గ్రామ సచివాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ ప్రతినిధులు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాల్సిన వివిధ రకాలైన సేవల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా తమ దేశాల్లోకూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అందించాల్సిన సేవల గురించి పూర్తి స్థాయిలో మార్పులు చేర్చులు చేయాలని ఆయా దేశాల ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. చోడవరం గ్రామాన్ని ఇందుకోసం రోల్ మోడల్ గా స్వీకరించేందుకు ఆయా దేశాలు సిద్ధంగా ఉన్నాయి.

శ్రీలంక, బంగ్లాదేశ్, బోత్స్వానా, కెమరూన్, ఈజిప్ట్, యుథోపియా, ఘనా, ఇరాక్, కెన్యా, మారిషస్, నైజీరియా, దక్షిణ సూడాన్, తజ్కిస్తాన్, టాంజానియా, ఉజ్బెకిస్తాన్, జాంబియాలతోపాటుగా మొత్తంగా 19 దేశాలు ఈ గ్రామ సచివాలయాన్ని, అది అందించే సేవలను గురించి అధ్యయనం చేయడానికి తమ ప్రతినిధులను భారత దేశానికి పంపించాయి. కార్యదర్శులు, వార్డ్ సెక్రటరీల నియామకం ద్వారా ఆంధ్రప్రదేస్ రాష్ట్రం ఇకపై ప్రపంచంలోని అనేక దేశాలకు గ్రామ సేవలు అందించడంలో రోల్ మోడల్ గా నిలిచిందంటూ ఆయా దేశాల ప్రతినిధులు ప్రశంసించడం విశేషం.

సచివాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని విభాగాలూ ఇకపై ప్రభుత్వంతో అనుసంధానమై పనిచేయబోతున్నాయి. వీటిద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 500 రకాల సేవలు నేరుగా లబ్ధిదారులకు ఇంటి వాకిట్లోకే అందుబాటులోకి రానున్నాయి. అధికార వికేంద్రీకరణకు ఈ గ్రామ సచివాలయాలు సరికొత్త ఉదాహరణలుగా నిలుస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

గ్రామ పరిపాలనా వ్యవస్థను కొత్త పుంతలు..

గ్రామ పరిపాలనా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించేందుకు, వివిధ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుడికి ఉన్న చోటికే సేవలు అందించేందుకు ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 11 మంది ఉద్యోగులు ఈ గ్రామ సచివాలయానికి అనుసంధానమై ఇకపై పనిచేయాల్సి ఉంటుంది. గ్రామస్తులు నేరుగా తమకు ఏ సౌకర్యం కావాలన్నా గ్రామ సచివాలయాన్ని సంప్రదిస్తే చాలు.

బోత్స్ వానా దేశానికి చెందిన ఆర్థిక ప్రణాళికా నిపుణుడు అగిసాంగ్యాంగ్ కౌప్వా ఈ కొత్త విధానం గ్రామీణులకు సేవలు అందించడానికి సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అత్యున్నత స్థాయి పరిజ్ఞానంతో ప్రభుత్వ సేవలను అందించేందుకు రూపొందించిన ఈ సరికొత్త విధానం తప్పనిసరిగా ప్రజాభిమానాన్ని విస్తృత స్థాయిలో చూరగొంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు ఈ విధానం ఆదర్శవంతమవుతుందని చెప్పారు.

గ్రామ పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన పూర్తి స్థాయి పర్యవేక్షణ, అధికారాలు రాష్ట్రానికి ఈ విధానం ద్వారా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని కెమరాన్ కి చెందిన వ్యవసాయ శాఖ నిపుణుడు ఎన్ కోడర్ క్రిస్టఫర్ అభిప్రాయపడ్డారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఒకేచోట గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో అందుబాటులో ఉండడంవల్ల జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఎలాంటి అవరోధాలూ లేకుండా అందే అవకాశం ఉందన్నారు.

ఈ విధానంలో ప్రభుత్వం నేరుగా ప్రజల దగ్గరికే వచ్చే అవకాశం ఉందని బంగ్లాదేశ్ కు చెందిన సామాజిక సేవా విభాగం అధికారి ఓజే కుమార్ హల్దార్ అన్నారు. వృద్ధాప్య పింఛన్ లు సరైన కాలంలో సరిగ్గా అందించడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని ఆయన కొనియాడారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించి వారి అభ్యున్నతికోసం కృషి చేయడానికి ఇదే సరైన మార్గమన్నారు.

Next Story