ఆగని వరకట్న వేధింపులు.. భార్యపై కత్తులతో దాడి..
By అంజి Published on 23 Jan 2020 4:36 PM IST
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కట్టుకున్న భార్యపై అదనపు కట్నం తేవాలంటూ ఓ ఎస్సై కుమారుడు కత్తితో దాడికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఐరాస మండలం సంతగేటుకు చెందిన రోజాకు, గంగధార నెల్లూరు మండలం పెద్దకాల్వకు చెందిన పవన్ కుమార్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే భార్య తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో కట్నకానుకలు ఇచ్చారు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లి జరిగి సంవత్సరం గడిచిన తర్వాత భార్యను భర్త పవన్ కుమార్ వేధింపులకు గురిచేశాడు.
కొద్ది కాలంగా అదనపు కట్నం తేవాలంటూ భర్త పెడుతున్న హింసను భార్య తట్టుకోలేకపోయింది. నిత్యం వేధింపులు తాళలేక పోయిన ఆ భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్యపై భర్త పవన్ కుమార్, అత్త భానుమతి, మామ ఏఎస్‌ఐ జ్ఞానప్రకాష్ కోపం పెంచుకున్నారు. కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన అత్తమామలు, కుమారుడితో పాటు పిశాచులుగా మారారు. ఏఎస్‌ఐ స్థాయిలో ఉన్న మామ కూడా కొడుకుకు వత్తాసు పలకి కత్తులతో దాడికి దిగారు. వరకట్న వేధింపులపై ప్రభుత్వం, పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా సమాజంలో ఏ మాత్రం మార్పు రాలేదనడానికి ఈ సంఘటన నిదర్శనంగా మారింది.
బాధితురాలిపై భర్త, అత్తమామలు కలిసి కత్తులతో దాడికి దిగారు. బాధితురాలు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే చిత్తూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు భార్య, భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు.