అభిమానుల మృతి పై చిరంజీవి, రామ్‌చరణ్ ఏమన్నారంటే..?
By తోట వంశీ కుమార్ Published on 2 Sept 2020 12:14 PM ISTజనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. ఆ సమయంలో ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. కాగా.. ఈ ఘటనపై రామ్‌చరణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. 'మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే.. ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని రామ్‌చరణ్ తెలిపారు.
ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'చిత్తూరులో పవన్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం నా గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ, మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం' అని చిరంజీవి ట్వీట్ చేశారు.