Fact Check : భారత సైనికులను చైనా ఆర్మీ శిక్షించిందంటూ వీడియో వైరల్..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Jun 2020 5:54 AM GMTగల్వాన్ లోయ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న గొడవలో భారత్ కు చెందిన 21 మంది సైనికులు వీరమరణం పొందారు. భారత్-చైనాల మధ్య ఉన్న సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొందరు మాత్రం భారత ఆర్మీ ని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అలాంటి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. కొందరు సైనికులు కింద పడుకుని ఉండగా వారి నోట్లో గుడ్డలు కుక్కి ఉండడం చూడొచ్చు. వారిని చేతులను, కాళ్లను కట్టి ఉంచారు. ఈ వీడియోని ‘Waqas Malik ‘Vicky’ అనే యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశారు. Chinese Army punishing Indian Army అనే టైటిల్ ను ఈ వీడియోకు ఉంచారు. చైనీస్ ఆర్మీ భారత జవాన్లను కఠినంగా శిక్షిస్తోందని.. ఇటీవల గల్వాన్ లో చోటుచేసుకున్న ఘటన తర్వాత ఇది చోటుచేసుకుందని ఆ వీడియో ద్వారా చెబుతున్నారు.
Chinese Army Punishing Indian Army #ChinaIndiaFaceoff #IndiaOnKneesInLadakh https://t.co/TQXwnU4X1r via @YouTube
— Waqas Malik 'Vicky' (@itswaqasmalik) May 29, 2020
ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా ఈ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
భారత సైనికులను చైనా ఆర్మీ శిక్షించిందంటూ వైరల్ అవుతున్న వీడియో పచ్చి అబద్దం.
ఈ వీడియోలకు చెందిన కీఫ్రేమ్స్ ను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇందుకు సంబంధించిన ఎక్కువ నిడివి గల వీడియోలు దొరికాయి. TikTok లోగో ఉండి ahmed_shabir అనే ఐడీలో కనిపించింది.
ఏప్రిల్ 21, 2020న వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో సైనికులు నవ్వుతూ ఉండడమే కాకుండా, తమ శిక్షణ మొదలు పెట్టడానికి రెడీ అవుతుండడం గమనించవచ్చు.
https://www.tiktok.com/@ahmed__kabir/video/6818190621312945414
Mixer World అనే యూట్యూబ్ ఛానల్ లో ‘Bangladesh Army hard training.বাংলাদেশ আর্মি ট্রেনিং কতটা ভয়ানক,কতটা জীবনের ঝুঁকি নিয়ে ট্রেনিং করতে’. వీడియో దొరికింది. ఈ వీడియోలో సైనికులు బెంగాలీలో మాట్లాడుకోవడం గమనించవచ్చు. ఈ వీడియోను అక్టోబర్ 3, 2019 లో అప్లోడ్ చేశారు. భారత్-చైనా గొడవల కంటే ముందే ఈ వీడియో యూట్యూబ్ లో ఉంది.
బంగ్లాదేశ్ ఆర్మీలో ఇచ్చే కఠినమైన శిక్షణకు సంబంధించిన వీడియో ఇదని అందులో రాసుకుని వచ్చారు. ఎంత కఠినమైన ట్రైనింగ్ అయినా బంగ్లాదేశ్ సైనికులు తట్టుకుంటారన్నది ఈ వీడియో నిదర్శనం అని ఆ వీడియో డిస్క్రిప్షన్ లో రాసుకుని వచ్చారు. బంగ్లాదేశ్ కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమైన వారికి ఇచ్చే కఠిన శిక్ష ఇదని అందులో రాసుకుని వచ్చారు. ఆర్మీలో చేరాలి అనుకుంటున్న వాళ్ళను భయపెట్టడానికి ఈ వీడియో అప్లోడ్ చేయలేదని, కఠినమైన ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలియజేయాలని ఈ వీడియోను అప్లోడ్ చేశామని అన్నారు.
ఇండియా టుడే కూడా ఈ వీడియోలు ఫేక్ అని తేల్చింది.
చైనీస్ ఆర్మీ భారత సైనికులను హింసిస్తోంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. బంగ్లాదేశ్ సైనికులకు కఠినమైన శిక్షణ ఇస్తున్నప్పటి వీడియో అది.
భారత జవాన్ లను చైనా ఆర్మీ శిక్షించిందంటూ వైరల్ అవుతున్న వీడియో అబద్దం.