సరిహద్దుల్లో 60వేల చైనా సైనికులు
By సుభాష్ Published on 10 Oct 2020 7:35 AM GMTభారత్-చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో 60వేల చైనా సైనికులు మోహరించి ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో అన్నారు. కయ్యాలమారి పక్కలో బల్లెంగా మారిందని ఆరోపించారు. లడఖ్ ప్రాంతంలో భారత్ - చైనాల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, అమెరికాల సంబంధాలు మరింత దృఢమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారీ సైనిక సమీకరణ దిశగా చైనా అడుగులు వేస్తోందని, అందుకు భారత్‌కు అమెరికా వెన్నంటి ఉండటం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈయన గతంలో కూడా పలుమార్లు భారత్ పక్షాన నిలబడి డ్రాగన్ దూకుడును ఖండించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పక్షాన ఉండటం చాలా అవసరమని, భారత్‌కు వ్యతిరేకంగా చైనా భారీ సైనిక బలాలను సమీకరిస్తోందని, అయితే చైనా దూకుడును ప్రపంచం మొత్తం గమనిస్తోందని అన్నారు. ఈ ప్రమాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ట్రంప్ నాయకత్వం ఓ కూటమిగా ఏర్పడటం అవసరముందన్నారు. ఈ వారం టోక్యోలో జరిగిన భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ - చైనా సరిహద్దుల్లో లడఖ్ వద్ద మే నెల నుంచి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఇక జూన్‌లోఇరు పక్షాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనాకు చెందిన 40 మంది సైనికులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇప్పటి వరకు ఎంత మంది మృతి చెందారనే విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరో వైపు మైక్ పాంపియో, అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్పర్ చర్చలు జరిపేందుకు ఈనెల 26,27 తేదీల్లో భారత్‌కు రానున్నారు. ప్రస్తుత చైనా విషయంలోనే కాకుండా ఇతర విషయాల్లోనూ భారత్, అమెరికా మధ్య సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పాంపియో భారత పర్యటనలో రక్షణ సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరుగుతున్నాయని అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్‌సింగ్ అన్నారు.