చైనా వాణిజ్య మంత్రం తిరగబడుతుందా?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 2:47 PM GMT
చైనా వాణిజ్య మంత్రం తిరగబడుతుందా?!

మేడిన్ చైనా మంత్రం తిరగబడిందా..? ప్రపంచ పంపిణీదారు పేరును చైనా దూరం చేసుకుంటోందా..? చైనా నుంచి కంపెనీలు ఎందుకు వలస వెళ్తున్నాయి..? వాణిజ్య యుద్ధం డ్రాగన్‌ను దెబ్బ తీసి మనదేశా నికి మేలు చేస్తోందా..?మేడిన్ చైనా... ప్రపంచాన్నే మార్చేసిన మాట ఇది. దశాబ్దాలుగా జనంనోళ్లల్లో నానిన పదం ఇది. అభివృద్ధిచెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు, ఇలా ఎక్కడ చూసినా ఇదే మాట. ప్రపంచ పారిశ్రామిక శక్తిగా, ఉత్పత్తి-తయారీ రంగంలో తిరుగులేని దేశంగా చైనాను నిలబెట్టింది. అంతర్జాతీయ సమాజంలో చైనా ఆధిపత్యానికి ఆదరవు ఇచ్చిందీ మేడిన్ చైనా పదమే. చైనా పరువు-ప్రతిష్టలకు బలమైన ఆధారంగా నిలిచి, డ్రాగన్‌ మెరుపు లకు కారణమైన మేడిన్ చైనా, ఇకపై మసక బారనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మేడిన్ చైనా యుగం ముగిసింది.

మేడిన్‌ చైనా యుగం ఇక ముగిసింది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా సైకిళ్లను తయారు చేసే జెయింట్‌ మాన్‌ఫాక్చరింగ్ కంపెనీ అధ్యక్షురాలు బొన్నె టూ. ప్రపంచానికి పంపిణీదారుగా ఉన్న చైనా పాత్ర ముగుస్తోందని బొన్నె టూ స్పష్టం చేశారు. ఇది ఇప్పుడే మొదలైంది కాదని, గత సంవత్సరం నుంచే మేడిన్ చైనా శకం ముగియడం ప్రారంభమైందని ఆమె పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ వార్ చైనా పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని బొన్నె టూ అభిప్రాయపడ్డారు. పన్ను పోట్లను భరించలేక చాలా కంపెనీలు చైనా నుంచి వలసపోతున్నాయి. అందులో జెయింట్ సంస్థ కూడా ఒకటి. జెయింట్ కంపెనీకి చైనాలో 5 ప్లాంట్లు ఉన్నాయి. తైవాన్, నెదర్లాండ్స్‌లలోనూ ప్లాంటున్నాయి. ఐతే, అధిక పన్నులు, ప్రభుత్వం నుంచి ఉపశమన చర్యలు లేకపోవడంతో జెయింట్ కూడా వలసబాట పట్టింది. చైనా నుంచి వలసపోవాలని నిర్ణయించుకున్న జెయింట్, దక్షిణాసియాలో ఒక భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చే ఆర్డర్ల కోసం పనిచేసే తయారీ కేంద్రాన్ని కూడా తైవాన్‌కు మార్చనున్నట్లు తెలిపింది.

చైనాను ట్రంప్ దెబ్బ కొట్టాడా?

చైనాలో ఉత్పత్తి-తయారీ ఖర్చులు ఒకప్పుడు చాలా తక్కువ. అందుకే వస్తువులను విచ్చలవిడిగా ఉత్పత్తి చేసేవారు. ఎగుమతుల విషయంలోనూ సౌలభ్యం ఉండేది. ఎగుమతి చేసే వస్తువులపై పన్నులు తక్కువగా ఉండడంతో అంతర్జాతీయ కంపెనీలు చైనాలో మకాం వేశాయి. స్వదేశీ-విదేశీ సంస్థలతో తయారీ-ఉత్పత్తి రంగంలో చైనా రారాజు గా ఎదిగింది. దేశంలో మానవ వనరులు విపరీతంగా ఉండడం, శ్రమించడానికి వెనకాడే మనస్తత్వం లేకపోవడం, తక్కువ జీతాలకే పని చేసే వ్యక్తులు ఉండడం చైనాకు కలసి వచ్చింది. దాంతో అతి తక్కువ ధరలకే దాదాపు అన్ని దేశాలకు వివిధ రకాల వస్తువులను ఎగుమతి చేసి ప్రపంచ పంపిణీదారుగా కీర్తి గడించింది. ఐతే, అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రాకతో చైనా ప్రాభవం క్షీణించడం మొదలైంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్-అమెరికా ఫస్ట్ అంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ట్రంప్, పాలనా కాలంలోనూ అవే మాటలు చెబుతూ ప్రపంచ దేశాలను బెదరగొడుతున్నారు. ఇందులో భాగంగా చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై పన్ను రేట్లు అమాంతం పెంచేశారు. ప్రతిగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టాక్స్ పెంచేసింది. రెండు దేశాలు పోటీపడి టాక్స్‌లు పెంచడంతో వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ వాణిజ్య యుద్ధం చైనా పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఉత్పత్తి, తయారీ రంగాలు కుదేలయ్యాయి. కీలక రంగాల్లో ప్రగతి నెమ్మదించడంతో వృద్ధి రేటు కూడా క్షీణించింది.

టాక్స్ వార్ కొంపముంచిందా?

చైనాలో ఒక సైకిల్‌ను తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయాలంటే 100 డాలర్ల వరకు టారీఫ్‌ చెల్లించాల్సి ఉంటుంది. అదే జీరో టారీఫ్‌ దేశాల నుంచి ఎగుమతి చేస్తే ఆ మేరకు కంపెనీలకు మిగులుతుంది. కాకపోతే ఇతర దేశాల్లో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. విడిభాగాల సరఫరా కూడా అంత వేగంగా ఉండదు. ఐతే, వాణిజ్య యుద్దం ముగియకపోవడం, టాక్స్ వార్ కొనసాగుతుండడం, వృద్ధి రేటు క్షీణించడం తదితర కారణాలతో ప్రముఖ సంస్థలు చైనా నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతు న్నాయి. చైనా-అమెరికా ట్రేడ్‌వార్‌లో నలిగిపోయే కంటే ఇతర దేశాలకు వెళ్లిపోవడమే మంచిదని జెయింట్‌ అభిప్రాయపడుతోంది. మరికొన్ని సంస్థలు కూడా జెయింట్‌ బాటలో పయనించడానికి సిద్ధమయ్యాయి. ఇంటెల్‌ కార్ప్‌ తన సరఫరాదారుల విషయంలో మరోసారి సమీక్షిస్తానని పేర్కొంది. లి అండ్‌ ఫుంగ్‌ కార్ప్‌ సంస్థ కూడా ట్రేడ్ వార్‌ కార ణంగా చైనా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రకటించింది.

భారత్ కు కలిసి రానుందా?

చైనా-అమెరికా ట్రేడ్ వార్, మేడిన్ చైనా మసకబారడం భారతదేశానికి కలసి వచ్చే అంశాలని పారిశ్రామికరంగ నిపుణులు అంటున్నారు. చైనా నుంచి వలసవచ్చే కంపెనీలకు భారతదేశం స్వర్గధామంగా మారే అవకాశముందని చెబుతున్నారు. చైనాకు చెందిన 200 సంస్థలు భారత్‌కు వలసవచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన US-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ ఫర్మ్స్‌ పేర్కొంది. వచ్చే 12-18 నెలల్లో కేవలం భారత్‌లో కొన్ని విధాన పరమైన మార్పులు తీసుకొస్తే భారీ సంఖ్యలో కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెడతాయని ఆ సంస్థ తెలిపింది. పారిశ్రామిక రంగంలో సంస్కరణలు పెంచి, పాలనాపరంగా అనుమతుల మంజూరు వేగవంతం చేస్తే ప్రధాని మోదీ ప్రకటించిన మేకిన్ ఇండియా పాలసీ కొత్త పుంతలు తొక్కడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.

  • రంజన్, సీనియర్ జర్నలిస్ట్

Next Story