మోదీ లడఖ్‌ పర్యటనపై చైనా స్పందన ఏంటంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2020 12:27 PM GMT
మోదీ లడఖ్‌ పర్యటనపై చైనా స్పందన ఏంటంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం లడఖ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. మోదీ లడఖ్‌లో పర్యటించిన విషయం తెలియగానే చైనా ఉలిక్కిపడింది. వెంటనే ప్రధాని పర్యటనపై చైనా స్పందించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకునేందుకు భారత్, చైనా దేశాలు సైనిక, దౌత్యపరంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇలాంటి సమయంలో పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యలు తీసుకునే దిశగా ఎవ్వరూ వ్యవహరించవద్దని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ అన్నారు. దీని వల్ల పరిస్థితులు మరింత దిగజారుతాయనన్నారు.



నిన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్ పర్యటన వాయిదా పడిన తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా లడఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రధాని సైనికులతో మాట్లాడారు. సైనికుల ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని, దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతుందన్నారు. ప్రపంచం మొత్తానికి గట్టి సందేశం ఇచ్చారు. లడఖ్‌ నుంచి కార్గిల్‌ వరకు మీ ధైర్యం అమోఘమన్నారు. ఇంత కఠిన పరిస్థితుల్లోనూ దేశం కోసం పని చేస్తున్నారని కొనియాడారు. భారత సైనికుల తెగువ వెలకట్టలేనిదని, భద్రతా బలగాల శౌర్యానికి సెల్యూట్‌ అన్నారు.

భారత శతృవులకు గట్టి గుణపాఠం నేర్పారని, ధైర్యవంతులే శాంతి కోరుకుంటారని అన్నారు. శాంతిపై భారత్‌కు ఉన్న నిబద్ధతను ప్రపంచమంతా గమనించిందని, జవాన్ల త్యాగం నిరూపమానమైనదని, ఆధునిక సాంకేతికతను, అభివృద్ధిని అందిపుచ్చుకుంటున్నామని అన్నారు. కాగా, ప్రధాని మోదీ సరిహద్దు పర్యటనతో చైనా షాక్‌కు గురైంది. లడఖ్‌ ఆకస్మిక పర్యటనతో మోదీ ప్రపంచాన్ని ఆశ్చర్పరిచారు.శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చోం.. అని అన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేశామన్నారు. ప్రతి పోరాటంలో విజయం మనదే అన్నారు.

Next Story