1500 దాటిపోయిన కరోనా మృతుల సంఖ్య.. ఒకే రోజు 166 మంది మృతి

By సుభాష్  Published on  15 Feb 2020 5:07 AM GMT
1500 దాటిపోయిన కరోనా మృతుల సంఖ్య.. ఒకే రోజు 166 మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ‘కరోనా వైరస్’ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అన్ని దేశాలకు చాపకింద నీరులా పాకుతోంది. ఈ వైరస్‌ వల్ల ప్రపంచం మొత్త భయభ్రాంతులకు గురవుతోంది. చైనాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకు 1500 దాటిపోయిన మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా మృతుల సంఖ్య.. వైద్యులనూ సైతం వదలడం లేదు. ఇప్పటి వరకు ఆరుగురు వైద్యులు మృతి చెందారు. నిన్న ఒకే రోజు 166 మంది మృతి చెందగా, కొత్తగా 4వేల 822 కేసులు నమోదయ్యాయి.

25 దేశాల్లో కరోనా కేసులు

ఇప్పటి వరకు 25 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 67 వేలకుపైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జపాన్‌ ఓడలోని ముగ్గురు భారతీయులకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 197 మంది కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి.

వ్యాపారాలపై కరోనా ప్రభావం

కరోనా కారణంగా ఈ -కామర్స్‌ రెవెన్యూ భారీగా పడిపోయిందని చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ప్రధాన ఆదాయం ఉన్న ఈ-కామర్స్‌ రెవెన్యూపై భారీగానే ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల లూనార్‌ కొత్త సంవత్సరం అనంతరం చైనాలో కంపెనీలు తెరుచుకోవడం కష్టంగా మారింది. దీని ప్రభావం వ్యాపారులపై పడుతోంది.

కరోనా ఎఫెక్ట్‌

కరోనా వైరస్‌ కారణంగా చికెన్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చికెన్‌ ద్వారా కరోనా వ్యాపిస్తుందనే ప్రచారంతో చికెన్ విక్రయాలు సైతం భారీగా పడిపోయాయి. జనాలు చికెన్‌ తినాలంటేనే జంకుతున్నారు. దీని ఫలితంగా వారం రోజుల్లోనే చికెన్‌ అమ్మకాలు భారీగా పడిపోయాయి. రోజుకు 80 నుంచి 100 కిలోలు విక్రయించే షాపుల్లో, ఇప్పుడు 50-60 కిలోలు మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయని దుకాణదారులు వాపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి

ఈ వైరస్‌ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చికెన్‌ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కోళ్లు, గొర్రెలు, పందులు లాంటి జంతువుల ద్వారా ఈ కరోనా వైరస్‌ సోకుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాంసాన్ని బాగా ఉడికించి తినడం వల్ల ప్రమాదమేమి ఉండదని చెబుతున్నారు.

Next Story