జూన్ 8 నుండి చిలుకూరు బాలాజీ దేవాలయం తెరవడం లేదు.. ఎందుకంటే..
By తోట వంశీ కుమార్ Published on 1 Jun 2020 7:28 AM GMTలాక్‌డౌన్ 5.0లో సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యాప్తంగా ఉన్న ఆలయాలు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో అన్ని ప్రధాన ఆలయాలు తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తిరుమలలోని శ్రీవారి ఆలయం తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిలుకూరి దేవాలయం మాత్రం జూన్ 8 నుంచి తెరవడం లేదు. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు.
'కేంద్ర ప్రభుత్వం ఆలయాలు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చినప్పటికి జూన్ 8 నుంచి చిలుకూరి బాలాజీ ఆలయాన్ని తెరవడం లేదని' రంగరాజన్ అన్నారు. స్వామి వారికి ప్రతి రోజు కైంకర్యాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. భక్తులను ప్రస్తుతం అనుమతించడం లేదని, ఎప్పటి నుంచి అనుమతిస్తామనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కావున భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. 8 నుంచి భక్తులు చిలుకూరుకు రావొద్దని సూచించారు. స్వామి వారి దర్శన భాగ్యాన్ని త్వరలోనే భక్తులకు కల్పిస్తామన్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ నగర శివార్లలో ఉంది. గుడి పెద్ద ఆర్భాటాలు లేకుండా చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ మ్రొక్కుగా ప్రదక్షిణాలు చేస్తే వీసా తొందరగా వస్తుందని నమ్మకం. అందుకే ఇక్కడ వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని 'వీసా బాలాజీ' అని పిలుస్తారు.
పురాణ కథనం..
ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి ఏడాది తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవాడు. కానీ అనారోగ్యకారణంగా ఆయన తిరుపతికి వెళ్లలేకపోతాడు. అందుకు చింతిస్తున్న ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీ సమీపంలోని అరణ్యంలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను తవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించగా.. పుట్టనుండి శ్రీదేవీ భూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు.