మోదీ సవాల్‌కు స్పందించిన 'చిదంబరం'
By సుభాష్
ఇటీవల పార్లమెంట్‌లో పౌరసత్వబిల్లును ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ చట్ట సవరణను కొందరు సమర్ధిస్తుంటే.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఇతర ప్రాంతాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలపై ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. పాకిస్తానీయులందరికీ భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అంటూ మోదీ సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ప్రతిపక్షాలకు మోదీ ఇలాంటి సవాళ్లు విసరడం ఏమిటని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దేశ యువత, విద్యార్థులు, లౌకికవాద, సహనశీల దృక్పథాన్ని కనబరుస్తూ, మానవతావాదాన్ని ప్రదర్శించడం ఆనందం కలిగిస్తోందన్నారు. ఈ ఉన్నతమైన విలువలను ప్రభుత్వం సవాలు చేయదల్చుకుందా..? అని ప్రశ్నించారు.
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్దరించి, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసే ధైర్యం ఆ పార్టీకి ఉన్నాయా అని మోదీ ఎద్దేవా చేశారు. మంగళవారం జార్ఖండ్‌లో ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసింగిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. పౌరసత్వ సవరణ చట్టంలో భారత్ లో పౌరులకు ఎలాంటి హామీ ఉండబోదని మోదీ చెప్పుకొచ్చారు. అలాగే జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్రల్లో విద్యార్థులు చిక్కుకోవద్దని కోరారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇతర రాజకీయ పార్టీలు విద్యార్థుల మీద తుపాకీ చూపి కాల్చడానికి ప్రయత్నిస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు.