కాంగ్రెస్ కు ప్రధాని ఛాలెంజ్

By రాణి  Published on  17 Dec 2019 11:52 AM GMT
కాంగ్రెస్ కు ప్రధాని ఛాలెంజ్

ముస్లింలలో కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలన్నీ అనవసరంగా అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ చట్టం ద్వారా దేశంలోని ఏ ఒక్క పౌరుడూ ఇబ్బంది పడకూడదనే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని మోదీ తెలిపారు. పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇవ్వాలా అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. "మీకు దమ్ముంటే పాకిస్తానీలందరికీ ఇక్కడ పౌరసత్వం ఇస్తామని ప్రకటించండి" అని మోదీ సవాల్ చేశారు.

‘‘పౌరసత్వ(సవరణ) బిల్లును ఎందుకు ఆమోదించామో చాలా సార్లు చెప్పాను. మళ్లీ చెప్తున్నాను వినండి. పొరుగుదేశాల్లో ఇబ్బందులెదుర్కొంటున్న మైనార్టీల కోసం ఈ చట్టం చేశాం. నూతన పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి. ముస్లింలలో అభద్రతా భావాన్ని కల్పించి రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు నేను బహిరంగ సవాలు విసురుతున్నాను. వాళ్లకు పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇవ్వాలనుకుంటే బహిరంగంగా ప్రకటించండి. దేశ ప్రజలే వారికి సమాధానం చెప్తారు’’అని మోదీ అన్నారు. కాగా ఇటీవలే పౌరసత్వ సవరణ బిల్లు రాజ్య సభలో ఆమోదం పొందింది. దీని కారణంగా ఈశాన్య రాష్ర్టాల్లో..ముఖ్యంగా అస్సాంలో ఆందోళనలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ వాహనాలు తగులబెట్టి అల్లర్లు చేయడంతో అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, 144 సెక్షన్ విధించారు.

గుహవటిలో కర్ఫ్యూ ఎత్తివేత, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

అయితే గుహవటిలో విధించిన కర్ఫ్యూను నేటి నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. అసోం రాష్ట్రంలో కర్ఫ్యూను ఎత్తివేయడంతోపాటు బ్రాడ్ బాండ్ ఇంటర్‌నెట్ సర్వీసులను పునరుద్ధరించాం కానీ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను మాత్రం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన ఆందోళనలపై 136 కేసులు నమోదు చేశామని, 190 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి వెల్లడించారు. దిబ్రూఘడ్ నగరంలో మంగళవారం ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు, షిల్లాంగ్ నగరంలో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు అసోం రాష్ట్ర అదనపు డీజీ జీపీ సింగ్ చెప్పారు. గువాహటి నగరంలో పరిస్థితులు చక్కబడటంతో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పూర్తిగా కర్ఫ్యూను ఎత్తివేశామని డీజీ జీపీ సింగ్ ప్రకటించారు.

CAB ను వెనక్కి తీసుకోవాలి : మాయావతి

మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లు (CAB) 2019 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఎస్ పీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. ఈ చట్టం కారణంగా మున్ముందు సమాజంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని, అందుకే రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు మాయావతి తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్పే ఎన్డీయే చేయొద్దని, దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టించవద్దని ఆమె హితవు పలికారు.

Next Story